ఓటర్లకు డబ్బు పంచి ఓటేయకుండా అడ్డుకునేందుకు వైసీపీ కుట్ర చేస్తోంది: నాగబాబు ఆరోపణలు

  • ఈ నెల 12 వ తేదీ రాత్రి వైసీపీ డబ్బుల పంపకం చేస్తుందన్న నాగబాబు 
  • వేలిపై సిరా గుర్తు వేసి ఓటు వేయకుండా అడ్డుకోబోతున్నారంటూ ఆరోపణలు 
  • ఓటుకు పది లక్షలు ఇచ్చినా తీస్కోండి.. ఓటు మాత్రం వేయండంటూ ఓటర్లకు నాగబాబు సూచన
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేసేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందంటూ జనసేన నేత నాగబాబు సంచలన ఆరోపణలు చేశారు. ఈ నెల 12న అర్ధరాత్రి నుంచి ఇంటింటికీ డబ్బులు పంచుతూ ఓటర్ల వేళ్లపై ముందే సిరా గుర్తు వేసేందుకు ప్లాన్ కుట్ర చేస్తున్నారని చెప్పారు. ఈమేరకు తనకు విశ్వసనీయమైన సమాచారం ఉందంటూ నాగబాబు సోషల్ మీడియాలో ఓ వీడియో రిలీజ్ చేశారు. ముఖ్యంగా జనసేనాని పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఈ కుట్ర అమలు చేసేందుకు వైసీపీ గుండాలు, రౌడీలు, సన్నాసులు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.

ఓటర్లకు డబ్బులు ఇవ్వడంతో పాటు ఓటు హక్కు వినియోగించుకోకుండా అడ్డుకునేందుకు ప్లాన్ చేస్తున్నారంటూ నాగబాబు చెప్పారు. ఓటుకు పదివేలు, ఇరవై వేలు ఇచ్చేందుకు సిద్ధపడుతున్నారని ఆరోపించారు. వైసీపీ గూండాలు ఇచ్చే డబ్బులు తీసుకోవడం తీసుకోకపోవడం మీ ఇష్టం.. కానీ ఓటు హక్కు మాత్రం తప్పకుండా వినియోగించుకోవాలని నాగబాబు ఓటర్లకు సూచించారు. ఓటేయకుండా అడ్డుకోవడం అంటే మిమ్మల్ని చంపేయడమేనని, మీ ఆత్మగౌరవాన్ని కించపరచడమేనని చెప్పారు.

అదేసమయంలో ఓటుకు పదివేలు కాదు పది లక్షలు ఇచ్చినా తీసుకోండని కూడా నాగబాబు చెప్పారు. ఎందుకంటే.. వాళ్లు ఇప్పుడు ఇచ్చే డబ్బు మీదే.. మీ సొమ్ము కొల్లగొట్టి వారు వెనకేసుకున్నారని వివరించారు. పిఠాపురం నియోజకవర్గంలోని ఓటర్లు తప్పకుండా ఓటేయాలని సూచిస్తూ.. నియోజకవర్గంలోని జనసైనికులు, బీజేపీ, టీడీపీ కార్యకర్తలు అందరూ అప్రమత్తంగా ఉండాలని నాగబాబు హెచ్చరించారు.


More Telugu News