ప్చ్‌.. 2 సెంటీమీటర్ల తేడాతో నీరజ్ చోప్రాకు చేజారిన‌ గోల్డ్.. ఇదిగో వీడియో!

  • ప్రతిష్టాత్మక దోహా డైమండ్‌ లీగ్‌లో భారత‌ స్టార్ ప్లేయర్‌కు త్రుటిలో చేజారిన స్వ‌ర్ణ ప‌త‌కం
  • ఆఖ‌రిదైన ఆరో ప్రయత్నంలో 88.36 మీటర్ల దూరానికి జావెలిన్‌ విసిరిన నీరజ్
  • చెక్‌ రిపబ్లిక్‌ ప్లేయర్ జాకబ్‌ వాద్లెచ్‌ 88.38 మీటర్లతో అగ్ర‌స్థానం కైవసం
  • గ్రెనెడాకు చెందిన‌ అండర్సన్‌ పీటర్స్ (86.62 మీట‌ర్లు) కు కాంస్య పతకం
భారత జావెలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్రా త్రుటిలో గోల్డ్ మెడ‌ల్‌ను చేజార్చుకున్నాడు. శుక్రవారం ఖ‌తార్ స్పోర్ట్స్ క్ల‌బ్‌లో జరిగిన ప్రతిష్టాత్మక దోహా డైమండ్‌ లీగ్‌లో ఈ స్టార్ ప్లేయర్ కేవలం 2 సెంటీమీటర్ల తేడాతో రెండో స్థానానికి ప‌రిమితం కావ‌డంతో సిల్వ‌ర్‌తో సరిపెట్టుకున్నాడు. ఆఖ‌రిదైన ఆరో ప్రయత్నంలో 88.36 మీటర్ల దూరానికి జావెలిన్‌ విసిరిన నీరజ్ రజతం సాధించ‌డం జరిగింది. ఇక చెక్‌ రిపబ్లిక్‌ ప్లేయర్ జాకబ్‌ వాద్లెచ్‌ 88.38 మీటర్లతో అగ్ర‌స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. 

కాగా, తొలి ప్రయత్నంలో ఫౌల్‌ చేసిన నీరజ్‌, ఆ తర్వాతి నాలుగు ప్రయత్నాల్లో వరుసగా 84.93, 86.24, 86.18, 82.22 మీటర్ల దూరాన్ని నమోదు చేశాడు. దీంతో చివరి ప్రయత్నంగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధ‌మైన అత‌డు 88.36 మీటర్ల దూరం జావెలిన్ విసిరాడు. దీంతో వాద్లెచ్‌ నమోదు చేసిన రికార్డుకు అత్యంత చేరువగా వెళ్లి, త్రుటిలో తొలి స్థానాన్ని అందుకోలేక‌పోయాడు. అలా గోల్డ్ మెడల్‌కు దూరమయ్యాడు. 

ఇదే లీగ్ లో మరో భారత అథ్లెట్‌, ఆసియా గేమ్స్‌లో ర‌జ‌తం సాధించిన‌ కిశోర్‌ జెనా కూడా అత్యుత్తమంగా 76.31 మీటర్ల మేర విసిరి తొమ్మిదో స్థానంలో నిలిచాడు. ఇక రెండుసార్లు వ‌ర‌ల్డ్ ఛాంపియ‌న్ అయిన‌ గ్రెనెడాకు చెందిన‌ అండర్సన్‌ పీటర్స్‌ 86.62 మీట‌ర్ల దూరం బ‌ల్లెం విసిరి కాంస్య పతకం సాధించాడు.


More Telugu News