దిగ్గజాలున్న పాకిస్థాన్‌ను మరోమారు చిత్తుచేసి చరిత్ర సృష్టించిన ఐర్లాండ్

  • మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి విజయం సాధించిన ఐర్లాండ్
  • పాక్ నిర్దేశించిన 183 పరుగుల లక్ష్యాన్ని మరో బంతి ఉండగానే సాధించిన ఐర్లాండ్
  • ఓవరాల్‌గా పాక్‌పై రెండో విజయం సాధించిన పసికూన
అంతర్జాతీయ టీ20లో మరో రికార్డు నమోదైంది. ప్రపంచంలోని అత్యుత్తమ జట్లలో ఒకటైన పాకిస్థాన్‌ను క్రికెట్‌లో ఓనమాలు దిద్దుకుంటున్న ఐర్లాండ్ ఐదు వికెట్ల తేడాతో ఓడించి సంచలనం నమోదు చేసింది. డబ్లిన్‌లో నిన్న జరిగిన తొలి టీ20లో పాకిస్థాన్‌పై విజయం ఘన విజయం సాధించి ప్రపంచకప్‌కు ముందు కావాల్సినంత ఆత్మవిశ్వాసాన్ని నింపుకుంది. 

పాకిస్థాన్ నిర్దేశించిన 182 పరుగుల విజయ లక్ష్యాన్ని మరో బంతి మిగిలి ఉండగానే ఐదు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించిన ఐర్లాండ్ రికార్డులకెక్కింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఓపెనర్ ఆండీ బాల్బిర్నీ 55 బంతుల్లో 10 ఫోర్లు, రెండు సిక్సర్లతో 77 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. హారీ టెక్టర్ 36, జార్జ్ డాక్‌రెల్ 24 పరుగులు చేశారు. చివరి 8 బంతుల్లో 16 పరుగులు అవసరమైన వేళ కర్టిస్ చాంపర్ హీరో అయ్యాడు. ఏడు బంతుల్లో 15 పరుగులు చేసి అపురూప విజయాన్ని జట్టుకు అందించిపెట్టాడు.  

అంతకుముందు పొదుపుగా బౌలింగ్ చేసిన ఐర్లాండ్.. పాకిస్థాన్‌ను 182/6కు పరిమితం చేసింది. కెప్టెన్ బాబర్ ఆజం (57),  ఓపెనర్ సైమ్ అయూబ్ 45, ఇఫ్తికార్ అహ్మద్ 37, ఫకర్ జమాన్ 20 పరుగులు చేశారు. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఐర్లాండ్ 1-0తో ఆధిక్యం సాధించింది. పాకిస్థాన్‌పై ఐర్లాండ్‌కు ఇది తొలి టీ20 విజయం కాగా, ఓవరాల్‌గా అన్ని ఫార్మాట్లలోనూ కలిపి ఆ జట్టుపై ఇది రెండో విజయం. 2007 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై తొలి విజయాన్ని సాధించి పాకిస్థాన్‌ను గ్రూప్ స్టేజ్ నుంచే ఇంటికి పంపింది. మళ్లీ 17 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆ జట్టుపై మరో విజయాన్ని అందుకుంది.


More Telugu News