3డీ ప్రింటెడ్ రాకెట్ ఇంజన్‌ను విజయవంతంగా పరీక్షించిన ఇస్రో

  • తమిళనాడులోని ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్‌లో పరీక్ష నిర్వహణ
  • 664 సెకెన్ల పాటు ఇంజెన్ మండించి విజయవంతంగా పరీక్ష
  • 3డీ ప్రింటెడ్ ఇంజెన్‌తో ముడిసరుకులో 97 శాతం ఆదా
  • పీఎస్ఎల్‌వీ రాకెట్‌లో త్రీడీ ఇంజెన్ వినియోగానికి ఇస్రో కసరత్తు
అంతరిక్ష రంగంలో భారతదేశ కీర్తి ప్రతిష్ఠలను ప్రపంచానికి చాటుతున్న ఇస్రో మరో విజయం అందుకుంది. త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీతో రూపొందించిన పీఎస్4 రాకెట్ ఇంజెన్‌ను శుక్రవారం విజయవంతంగా పరీక్షించింది. హాట్ టెస్టింగ్ పేరిట జరిగిన ఈ పరీక్షలో ఇస్రో పీఎస్4 ఇంజెన్‌ను 664 సెకెన్ల పాటు మండించింది. ఏఎమ్ టెక్నాలజీతో (3డీ ప్రింటింగ్) ఈ ఇంజెన్‌ను తయారీ చేసినట్టు పేర్కొంది. ఈ సాంకేతికతతో ముడిసరుకులో 97 శాతం, ఉత్పత్తి సమయంలో 60 శాతం ఆదా అవుతుందని పేర్కొంది. ద్రవ ఇంధన ఆధారిత పీఎస్4ను  పీఎస్‌ఎల్‌వీ రాకెట్ చివరి దశలో వినియోగిస్తారు. త్వరలో దీన్ని పీఎస్‌ఎల్‌వీ రాకెట్లలో వినియోగించనున్నారు. 

ఇస్రో ప్రకటన ప్రకారం, ప్రస్తుతం పీఎస్4 ఇంజెన్‌ను సంప్రదాయక పద్ధతుల్లో తయారు చేస్తున్నారు. పీఎస్‌ఎల్‌వీ నాలుగో దశలో వాడుతున్నారు. పీఎస్ఎల్‌వీ మొదటి దశలో రికాక్షన్ కంట్రోల్ సిస్టమ్‌లో కూడా దీన్ని వాడతారు. ఈ ఇంజెన్‌లో ఇంధనంగా మిథైల్ హైడ్రజీన్, ఆక్సిడైజర్‌గా నైట్రోజన్ టెట్రాక్సైడ్ వినియోగిస్తారు. అయితే, ప్రస్తుతం 3డీ ప్రింటింగ్‌కు అనుకూలంగా లిక్విడ్ ప్రొపల్షన్ సెంటర్.. పీఎస్‌4 ఇంజెన్‌ డిజైన్‌లో మార్పులు చేసింది. లెజర్ పౌడర్ బెస్ట్ ఫ్యూజన్ సాంకేతికత వినియోగంతో ఇంజెన్‌లో విడిభాగాల సంఖ్య 14 నుంచి ఒకటికి తగ్గించగలిగారు. ఇంజిన్‌ను భారతీయ సంస్థ విప్రో 3డీ తయారు చేయగా తమిళనాడులోని ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్‌లో విజయవంతంగా పరీక్షించారు.


More Telugu News