బెయిల్ వచ్చినందుకు కేజ్రీవాల్ థ్యాంక్స్ చెప్పింది ఆయనకే!

  • ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్
  • హనుమంతుడి ఆశీర్వాదం వల్లే బయటకు వచ్చానన్న ఢిల్లీ సీఎం
  • నేటి ఉదయం 11 గంటలకు హనుమంతుడి ఆలయ సందర్శన
మద్యం పాలసీ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ 40 రోజుల జ్యుడీషియల్ కస్టడీ తర్వాత నిన్న మధ్యంతర బెయిలుపై తీహార్ జైలు నుంచి అడుగు బయటపెట్టారు. తనకు బెయిలు వచ్చినందుకు హనుమంతుడికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో కొనసాగుతున్న నియంతృత్వానికి ముగింపు పలికేందుకు మద్దతివ్వాలని ప్రజలను కోరారు. బెయిలుపై బయటకు వచ్చిన కేజ్రీవాల్ నేడు బిజీబిజీగా గడపనున్నారు. ఢిల్లీలో రోడ్‌షోలు నిర్వహించనున్నారు. 

బెయిలుపై బయటకు వచ్చిన అనంతరం కేజ్రీవాల్ మాట్లాడుతూ.. మళ్లీ మీతో కలవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. త్వరలోనే బయటకు వస్తానని గతంలోనే చెప్పానని గుర్తుచేసుకున్నారు. తొలుత తాను హనుమంతుడికి ప్రణామాలు తెలియజేసుకుంటున్నానని, తాను ఈ రోజు మీ మధ్య ఉండడానికి ఆయన ఆశీర్వాదాలే కారణమని పేర్కొన్నారు. ఉదయం 11 గంటలకు కన్నాట్‌ప్లేస్‌లోని హనుమంతుడి ఆలయాన్ని కేజ్రీవాల్ సందర్శిస్తారు.

మార్చి 21న అరెస్ట్ అయిన కేజ్రీవాల్ తొలిసారి నేడు ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. నేడు నిర్వహించే రోడ్‌షోలో ఆయన వెంటనే పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్‌మాన్ సింగ్ కూడా రోడ్‌షోలో ఆయనతోపాటు పాల్గొననున్నారు. కాగా,  బెయిలుపై బయటకు వచ్చిన కేజ్రీవాల్ ముఖ్యమంత్రి విధుల్లో పాల్గొనడానికి వీల్లేదని సుప్రీంకోర్టు షరతులు విధించింది.


More Telugu News