కాంగ్రెస్ కూడా తప్పులు చేసింది: రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు

  • కాంగ్రెస్ పార్టీ రాజకీయాలను మార్చుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్య
  • పార్టీ వ్యక్తిగా ఈ మాట చెబుతున్నానన్న రాహుల్ గాంధీ
  • నరేంద్ర మోదీ ప్రధాని కాదు.. చక్రవర్తి అంటూ విమర్శలు
  • లక్నోలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ అగ్రనేత
భవిష్యత్ కాలంలో కాంగ్రెస్ పార్టీ తన రాజకీయాలను మార్చుకోవాల్సిన అవసరం ఉందని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీ కూడా తప్పులు చేసిందని, పార్టీలో మార్పు జరగాలని, కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా ఈ మాట చెబుతున్నానని ఆయన అన్నారు. లక్నోలో ‘సమృద్ధ్ భారత్ ఫౌండేషన్’ అనే సంస్థ నిర్వహించిన ‘సంవిధాన్ సమ్మేళన్’ అనే కార్యక్రమంలో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే పార్టీలో ఎలాంటి మార్పులను ఆశిస్తున్నారనే విషయాన్ని రాహుల్ గాంధీ వివరించలేదు. 

ఇక ప్రధాని నరేంద్ర మోదీ ఒక చక్రవర్తి అని, ఆయన ప్రధాని కాదని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ఇద్దరు ముగ్గురు ఫైనాన్షియర్ల కోసం మాత్రమే మోదీ పనిచేస్తారని ఆరోపించారు. ఫైనాన్షియర్ల కోసమే మోదీ ఫ్రంట్ పనిచేస్తుందని అన్నారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో అధికార బీజేపీ 180 సీట్ల లోపే పరిమితం అవుతుందని అభిప్రాయపడ్డారు. నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని కాలేరని, కావాలంటే లిఖితపూర్వకంగా రాసిస్తానని అన్నారు.

రాజకీయాల్లో కొందరు వ్యక్తులు అధికారం ఎలా పొందాలని మాత్రమే ఆలోచిస్తారని, తాను పుట్టిందే దానిలో అని, అధికారంపై ఎలాంటి ఆసక్తి లేదని రాహుల్ గాంధీ అన్నారు. అయితే అధికారం అనేది ప్రజలకు సాయపడే సాధనమని ఆయన వర్ణించారు. 90 శాతం మందిని కలుపుకోకుంటే దేశం బలపడడం సాధ్యం కాదని, 90 శాతం మంది ఉద్యోగాలు, క్రీడలు, మీడియా, న్యాయవ్యవస్థ, అందాల పోటీల్లోకి కూడా అడుగు పెట్టలేరని రాహుల్ పేర్కొన్నారు. జనాభాలో కేవలం 10 శాతం మందిని సూపర్ పవర్‌గా మార్చాలనుకుంటున్నారా అంటూ అధికార బీజేపీని ఆయన ప్రశ్నించారు.


More Telugu News