సాయి సుదర్శన్, గిల్ సెంచరీల మోత.. గుజరాత్ టైటాన్స్ భారీ స్కోరు

  • ఇవాళ అహ్మదాబాద్ లో చెన్నై సూపర్ కింగ్స్ × గుజరాత్ టైటాన్స్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్
  • 20 ఓవర్లలో 3 వికెట్లకు 231 పరుగులు చేసిన గుజరాత్
  • తొలి వికెట్ కు 210 పరుగులు జోడించిన సాయి సుదర్శన్, గిల్
చెన్నై సూపర్ కింగ్స్ తో పోరులో గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లు కెప్టెన్ శుభ్ మాన్ గిల్, సాయి సుదర్శన్ సుడిగాలి ఇన్నింగ్స్ తో చెలరేగిపోయారు. చెన్నై బౌలర్లను ఉతికారేస్తూ ఇద్దరూ సెంచరీల మోత మోగించారు. వీరిద్దరి సెంచరీల సాయంతో గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 231 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. 

గిల్, సాయి సుదర్శన్ జోడీ తొలి వికెట్ కు ఏకంగా 210 పరుగులు జోడించడం విశేషం. గతంలో డికాక్, కేఎల్ రాహుల్  పేరిట ఉన్న 210 పరుగుల ఓపెనింగ్ పార్టనర్ షిష్ రికార్డును గిల్, సుదర్శన్ జోడీ సమం చేసింది. 

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది. అయితే, తమ సొంతగడ్డపై మొదట బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ టైటాన్స్ కు అదిరిపోయే ఆరంభం లభించింది. సాయి సుదర్శన్, గిల్ ఎడాపెడా బాదేస్తూ స్కోరును వాయువేగంతో ముందుకు తీసుకెళ్లారు. 

సాయి సుదర్శన్ 51 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సులతో 103 పరుగులు చేయగా... గిల్ 55 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సులతో 104 పరుగులు చేశాడు. గిల్  సెంచరీకి ఓ ప్రత్యేకత ఉంది. ఐపీఎల్ టోర్నీ చరిత్రలో ఇది 100వ సెంచరీ కావడం విశేషం.

అయితే, గిల్, సాయి సుదర్శన్ జోడీ చివర్లో నిదానించడంతో స్కోరు కూడా మందగించింది. ఆఖర్లో వచ్చిన డేవిడ్ మిల్లర్ (11 నాటౌట్), షారుఖ్ ఖాన్ (2) పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. చెన్నై బౌలర్లలో తుషార్ దేశ్ పాండే 2 వికెట్ల తీశాడు.


More Telugu News