తెలంగాణలో ఈసారి అత్యధిక స్థానాలు గెలుస్తాం .. తెలుగు ఛానల్‌తో ప్రధాని నరేంద్ర మోదీ

  • మాదిగ సామాజిక వర్గం ఎంతో వెనుకబడి ఉందన్న మోదీ
  • అవినీతి ఎక్కడున్నా తాను ఉపేక్షించేది లేదని స్పష్టీకరణ
  • కుటుంబ పాలన టాలెంట్‌ను దెబ్బతీస్తుందని వ్యాఖ్య
తెలంగాణలో ఈసారి అత్యధిక స్థానాలు గెలుస్తామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆయన ఎన్టీవీ ముఖాముఖిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ సీట్లే గెలుస్తుందని భావిస్తున్నానని పేర్కొన్నారు. పదేళ్ళ బీఆర్ఎస్‌పై ఉన్న కోపం కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో బెనిఫిట్ అయిందన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా కొన్నిరోజుల్లోనే ప్రజావిశ్వాసాన్ని కోల్పోయిందన్నారు.

తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ మాట వినిపిస్తోందని.... డబుల్ ఆర్ ట్యాక్స్ విని తాను ఆశ్చర్యపోయానన్నారు. ప్రచారంలో ఆర్ఆర్ ట్యాక్స్ ఉందని తాను చెప్పానని... కానీ ఎవరి పేరూ పేర్కొనలేదన్నారు. కానీ కొంతమంది ఆర్ఆర్ అంటే తమనే అని ఎందుకు అనుకుంటున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమే అన్నారు.

మాదిగ సామాజిక వర్గం ఎంతో వెనుకబడి ఉంది

తెలంగాణ విజన్ గురించి మాట్లాడుతూ... తెలంగాణలో మాదిగ సామాజిక వర్గం ఎంతో వెనుకబడి ఉందని ప్రధాని మోదీ అన్నారు. న్యాయం చేసేందుకే తాను వారి పక్షాన నిలబడ్డానన్నారు. బంజారాలు కూడా ఎంతో వెనుకబడి ఉన్నారని... చిన్న చిన్న ప్రయోజనాలు కూడా పొందలేకపోతున్నారన్నారు. అణగారిన వర్గాలను పైకి తేవడానికి తమ వద్ద ప్రణాళిక ఉందన్నారు. కాంగ్రెస్ పాలనపై అతి తక్కువ సమయంలోనే నిరాశ, నిస్పృహ ఏర్పడిందన్నారు. బీఆర్ఎస్‌పై కోపంతో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే వాళ్లు మాత్రం మేమే రాజులం... ప్రజలకు ఏమీ చేయమన్నట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రజావిశ్వాసాన్ని కోల్పోయిందన్నారు.

అవినీతి ఎక్కడున్నా ఉపేక్షించను

ఆర్ఆర్ ట్యాక్స్, లిక్కర్ స్కాం... ఇలా అవినీతి ఏ రాష్ట్రంలో ఉన్నా తాను ఉపేక్షించేది లేదన్నారు. అవినీతిపై నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటామన్నారు. ఇదీ తన కమిట్మెంట్ అని స్పష్టం చేశారు. అవినీతి తమ హక్కు అని కొందరు భావిస్తున్నారని... అందుకే అక్రమాలు చేసిన వారు బెయిల్ కూడా పొందడం లేదన్నారు. తాను పార్టీ పేరు చెప్పదలుచుకోలేదని... ఇప్పుడు అలాంటి పార్టీ మనుగడ ఎంత వరకు ఉంటుందో చెప్పలేనన్నారు. అవినీతితో ప్రపంచాన్ని కొనగలమని కొంతమంది భావిస్తున్నారని మండిపడ్డారు.

కుటుంబ పాలన టాలెంట్‌ను దెబ్బతీస్తుంది

కుటుంబ పాలన మన దేశ నైపుణ్యాన్ని, టాలెంటును దెబ్బతీస్తుందని మోదీ అన్నారు. ఆశ్చర్యమేమంటే యూపీలో సమాజ్ వాది పార్టీ యాదవ సామాజిక వర్గానికి టిక్కెట్లు ఇచ్చిందని... కానీ అందరూ వారి కుటుంబ సభ్యులేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ మధ్యప్రదేశ్‌లో తాము ఎక్కువ జనాభా ఉన్న యాదవ సామాజిక వర్గానికి సీఎం పదవి ఇచ్చామన్నారు. కుటుంబ పాలన వల్ల నైపుణ్యం బయటకు రాదన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో కుటుంబ పాలనతో జరిగింది ఇదే అన్నారు. తాము అవినీతి వైద్యుడిని అరెస్ట్ చేస్తే ఎవరూ నోరు మెదపరని... కానీ అవినీతి నాయకుడిని అరెస్ట్ చేస్తే మాత్రం విమర్శిస్తారని ఆవేదన వ్యక్తం చేశారు.

నేను నిమిత్తమాత్రుడిని....

అయోధ్య బాలరాముడిని రెండుసార్లు దర్శించుకున్నట్లు చెప్పారు. అక్కడ భక్తిలో మునిగిపోయానన్నారు. తన మనసులో ఎప్పుడూ 140 కోట్లమంది ప్రజలు ఉంటారని... వాళ్ల సంక్షేమే తన మనసులో మెదులుతుందన్నారు. రాముడి దర్శనం కోసం ఇప్పుడు లక్షలమంది వస్తున్నారని... వాళ్లందరినీ నియంత్రించడం కష్టంగా మారుతోందన్నారు. తాను చేసిందేమీ లేదని... అసలు చేయడానికేమీ లేదన్నారు. అంతా దేవుడి దయతోనే సాధ్యమవుతోందన్నారు. ప్రజలు కూడా ఈశ్వరుడి స్వరూపాలేనని... ప్రజల కోరిక, ఆకాంక్ష బలంగా మారినప్పుడు వాళ్లకు ఒక కొత్త వెలుగు, కొత్త సామర్థ్యం కనిపిస్తాయన్నారు. తాను మాత్రం నిమిత్తమాత్రుడినే అన్నారు. బహుశా గంగామాత తనను కాశీకి రప్పించి ఉంటుందన్నారు. రామాలయ నిర్మాణం సమయంలో 11 రోజులు నిష్ఠతో ఉన్నట్లు చెప్పారు.

టూరిజాన్ని అభివృద్ధి చేయాలంటే ఇతర నమూనాలు చూడాలన్నారు. తనకు గుజరాత్ అనుభవం ఉందన్నారు. ప్రపంచానికి పరిచయం చేసేందుకు మన దేశంలో చాలా ఉన్నాయని తెలిపారు. ఉదాహరణకు జీ20 సదస్సు జరిగినప్పుడు ఒక్కో దేశం నుంచి 300 సభ్యులు వచ్చారని... వారు దేశంలోని వివిధ ప్రాంతాలను చూశారన్నారు. వైవిధ్యాన్ని చూశారన్నారు. రంగు... రుచి... వాసన చూశారన్నారు. అప్పటి వరకు వారికి ఈ అనుభవం తెలియదన్నారు. 140 కోట్ల మంది మార్కెట్ భాషలో చెప్పాలంటే ఇది మంచి అవకాశమన్నారు. తాము అధికారంలోకి వచ్చాక అనేక సంస్కరణలు చేపట్టామన్నారు.


More Telugu News