'ఆర్' ట్యాక్స్ అంటూ నేను ఎవరి పేరు చెప్పకపోయినా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు: ప్రధాని మోదీ

  • కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక డబుల్ ఆర్ ట్యాక్స్‌పై చర్చ సాగుతోందన్న ప్రధాని
  • తెలంగాణ ఆర్ ట్యాక్స్... ఢిల్లీ ఆర్ ట్యాక్స్ అని విమర్శ
  • ఆర్ ట్యాక్స్ అంటే ఇక్కడ రజాకార్ ట్యాక్స్ అన్న ప్రధాని మోదీ
  • తెలంగాణలో ఎక్కడకు వెళ్లినా బీజేపీకి ఓటేస్తామని చెబుతున్నారని వెల్లడి
  • మీ సంపదను లాక్కునే వారు కావాలా? అని ప్రశ్న
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక డబుల్ ఆర్ ట్యాక్స్‌పై చర్చ సాగుతోందని... ఒక ఆర్ తెలంగాణ అయితే, రెండో ఆర్ ఢిల్లీది అని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. తాను ఎవరి పేరు చెప్పకపోయినప్పటికీ ముఖ్యమంత్రి (రేవంత్ రెడ్డి) వచ్చి వివరణ ఇస్తున్నారని... తెలంగాణ ఆర్ అంటే రజాకార్ అని పేర్కొన్నారు. ఈ డబుల్ ఆర్ కలిసి హైదరాబాద్‌ను, తెలంగాణను ఏటీఎం చేసేశారని ఆరోపించారు. రజాకార్ ట్యాక్స్ ఎలా ఉంటుందో పాతబస్తీకి వెళితే తెలుస్తుందన్నారు. ఎల్బీ స్టేడియంలో జరిగిన బీజేపీ భాగ్యనగర్ జనసభలో ప్రధాని పాల్గొన్నారు. అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తనకు హైదరాబాద్ చాలా ప్రత్యేకమని చెప్పారు.

తెలంగాణలో ఎక్కడకు వెళ్లినా బీజేపీకి ఓటేస్తామని చెబుతున్నారు

తెలంగాణలో ఎక్కడకు వెళ్లినా ఒక్కటే మాట వినిపిస్తోందని... బీఆర్ఎస్ వద్దు... కాంగ్రెస్ వద్దు... మజ్లిస్ వద్దు... బీజేపీకి మాత్రమే ఓటు వేస్తామని చెబుతున్నారన్నారు. 140 కోట్లమంది సంకల్పం గెలుస్తుందన్నారు. జూన్ 4న దేశం గెలుస్తుందని వ్యాఖ్యానించారు. ట్రిపుల్ తలాక్‌ను, ఆర్టికల్ 370ని వ్యతిరేకించిన వారు జూన్ 4న ఓటమి చవిచూడటం ఖాయమన్నారు. ఉద్యోగం, స్టార్టప్స్, పరిశ్రమలు ఇదీ మోదీ ట్రాక్ రికార్డ్ అన్నారు. కానీ లూటీ చేయడం, సంతృష్ట రాజకీయాలు, వారసత్వం ఇవీ కాంగ్రెస్ ట్రాక్ రికార్డ్ అని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ హయాంలో దిల్‌సుఖ్ నగర్ వరుస బాంబు పేలుళ్లు అందరికీ గుర్తున్నాయన్నారు. ఢిల్లీలో బలమైన ప్రభుత్వం వచ్చాకే బాంబు పేలుళ్లు ఆగిపోయాయన్నారు. కాంగ్రెస్ హయాంలో ఎక్కడకు వెళ్లాలన్నా భయపడే పరిస్థితి ఉండేదని, కానీ ఇప్పుడు అలాంటి పేలుళ్లు జరుగుతున్నాయా? అని ప్రశ్నించారు. ఈ బాంబు పేలుళ్లు బీజేపీ ప్రభుత్వం వచ్చాక ఆగిపోయాయని పేర్కొన్నారు. అందుకే మోదీని తొలగించాలని చాలామంది కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. దేశం ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్లకూడదన్నారు. తెలంగాణకు పసుపు బోర్డు ఇచ్చింది బీజేపీయే అన్నారు.

మీ సంపదను లాక్కునే వారు కావాలా?

మీ సంపదను లాక్కునే వారు మీకు కావాలా? మీ సంపదను కాపాడేవారు కావాలా? ఎంచుకోవాలని ప్రధాని సూచించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడమంటే మళ్లీ పాతరోజులను కావాలని కోరుకున్నట్లే అన్నారు. యువరాజుకు ట్యూషన్ చెప్పే ఓ నేత రామనవమి చేసుకోవడం తప్పని చెప్పారని... రాముడికి పూజ చేయడం తప్పా? దేశద్రోహమా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇవీ భారతదేశ సిద్ధాంతాలు

భారతదేశ సిద్ధాంతం అందరి సౌభాగ్యం... బుద్ధం శరణం గచ్ఛామి... మానవ సేవే మాధవ సేవ... జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీ గరీయసీ, బలమైన ప్రజాస్వామ్యమని వెల్లడించారు. కాంగ్రెస్ మోడల్ అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లను తగ్గించి ముస్లింలకు మతపరమైన రిజర్వేషన్లు ఇవ్వడమని మండిపడ్డారు. కాంగ్రెస్ భారతదేశ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ముందుకు సాగుతోందని మోదీ అన్నారు.


More Telugu News