పొరపాటున నోరుజారి కాంగ్రెస్‌కు ఓటేయాలన్న హరీశ్ రావు.. వీడియో ఇదిగో

  • బీఆర్ఎస్ అనబోయి కాంగ్రెస్ అన్న బీఆర్ఎస్ మాజీ మంత్రి
  • సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో
  • సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌‌లో బోయినపల్లి వినోద్‌ కుమార్‌కు మద్దతుగా హారీశ్ రావు ప్రచారం
తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత ఎన్నికల ప్రచారంలో పొరపాటున నోరుజారారు. బీఆర్ఎస్ కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్‌కు మద్దతుగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ కార్నర్‌ మీటింగ్‌లో మాట్లాడిన ఆయన కాంగ్రెస్‌కు ఓటేయాలంటూ ఓటర్లను కోరారు. ‘‘అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ముళ్లు, రైతులు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ కాంగ్రెస్‌కు ఓటు వేయాలి’’ అని అన్నారు. బీఆర్ఎస్ అనబోయి పొరపాటున కాంగ్రెస్‌కు ఓటు వేయాలనడంతో ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్‌పై విమర్శలు..
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో పొన్నం ప్రభాకర్ ఓటర్ల వద్దకు వెళ్లి చేతులు పట్టుకున్నారని, అధికారంలోకి రాగానే అక్కాచెల్లెమ్మలకు రూ.2500 ఇస్తానని వాగ్దానం చేశాడని, ఆ హామీ ఏమైందని ఇప్పుడు ప్రశ్నిస్తే చేతులు పైకెత్తారని కరీంనగర్ లోక్‌సభ అభ్యర్థి పొన్నం ప్రభాకర్‌పై హారీశ్ రావు విమర్శలు గుప్పించారు. మొన్ననే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటూ పొన్నం ప్రభాకర్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అక్కాచెల్లెమ్మలను, అవ్వాతాతలను, రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులను సైతం మోసం చేసిందని హరీశ్ రావు ఆరోపించారు.

ఇక్కడి ముస్లింలు కూడా ఒకసారి ఆలోచించాలని, కాంగ్రెస్ పార్టీ మూడవ స్థానంలో ఉంటుందని అన్నారు. కరీంనగర్‌లో హస్తం పార్టీ గెలిచే అవకాశమే లేదని, బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్‌ను ఆశీర్వదించాలని ఓటర్లను హరీశ్ రావు అభ్యర్థించారు.




More Telugu News