జగన్​ ప్రభుత్వాన్ని గద్దెదించాల్సిందే: పవన్​ కల్యాణ్​

  • రాష్ట్ర ప్రజల ఆర్థిక, సామాజిక భద్రత, రాష్ట్రాభివృద్ధే ఎన్డీఏ లక్ష్యమన్న పవన్ 
  • ఒక రాష్ట్రానికి మూడు రాజధానులు అనవసరమని స్పష్టీకరణ
  • సరైన ఆలోచనా విధానం లేని పాలకులున్నా గొప్పచట్టాలు కూడా నిష్ప్రయోజనమేనన్న కల్యాణ్
ప్రజల్ని, రాజకీయనాయకుల్ని మానసిక హింసకు గురిచేసే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్నిగద్దె దించాల్సిన అవసరముందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. రాష్ట్ర ప్రజలందరి ఆర్థిక, సామాజిక భద్రత, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యమే ఎన్డీఏ ఉమ్మడి అజెండా అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. పాలనా వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులు రాష్ట్రానికి అవసరం లేదని శాసన, పాలన, న్యాయ విభాగాలన్నీ ఒకే చోట ఉన్న రాజధాని మాత్రమే ఉండాలని తేల్చి చెప్పారు. ఓ ప్రముఖ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివిధ అంశాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. 

సరైన ఆలోచనా విధానం లేని పాలకులుంటే ఎన్ని గొప్ప చట్టాలున్నా నిష్ర్పయోజనమేనని పవన్ కల్యాణ్ తెలిపారు. అందుకు నిదర్శనమే ల్యాండ్ టైటిలింగ్ చట్టమన్నారు. ప్రజల ఆస్తులపైనా, సరిహద్దులపైనా పాలకుల ముద్రలు సరికాదన్నారు. పట్టాదారు పాసుపుస్తకాలపై , సరిహద్దు రాళ్లపైనా జగన్ బొమ్మలు వేసుకోవడం వల్లే ఈ చట్టం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. జగన్ ఐదేళ్ల పాలనలో హిందూ దేవాలయాలపై అనేక దాడులు జరిగాయని వీటి వెనుక ప్రభుత్వ పెద్దల పాత్ర ఉందని ఆయన ఆరోపించారు. రైతులకు కనీసం గోదా సంచుల్ని కూడా సరఫరా చేయలేని రైతు భరోసా కేంద్రాలు రాష్ట్రంలో ఎన్ని ఉంటే ప్రయోజనమేముందని ప్రశ్నించారు. 

మానవతా దృక్పథం ఉన్న ప్రభుత్వాలే అధికారంలో ఉండాలని, ప్రజల కష్టాలను కనీసం వినలేని ప్రభుత్వాలెందుకని పవన్ కల్యాణ్ నిలదీశారు. రాష్ట్ర యువత శక్తి యుక్తుల్ని వాలంటీర్ల పేరిట జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని తీవ్రంగా విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్ మీద గులకరాయి పడితే నిందితుల్ని 48 గంటల్లో పట్టుకోగలిగిన వ్యవస్థ ఉన్న జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానంద హత్య కేసు నిందితుల్ని ఎందుకు పట్టుకోలేకపోయిందని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. కావాలనే వివేకానంద హత్య కేసు నిందితుల్ని జగన్ ప్రభుత్వం కాపాడుతోందని తెలిపారు. ఈ ఎన్నికల్లో వివేకానంద హత్య ఉదంతం తీవ్రంగా ప్రభావితం చేస్తుందని పవన్ అన్నారు.




More Telugu News