కోహ్లీ చీతా పరుగు చూశారా? కింగ్ చేసిన మ్యాజికల్ రనౌట్ కు ఇంటర్నెట్ ఫిదా

  • బౌండరీ నుంచి దాదాపు 65 అడుగుల దూరం మెరుపువేగంతో పరిగెత్తిన కోహ్లీ
  • బంతిని ఒంటి చేత్తో అందుకొని కిందపడుతూ వికెట్లను గిరాటేసిన వైనం
  • నోరెళ్లబెడుతున్న నెటిజన్లు.. కోహ్లీ మానవ మాత్రుడు కాదంటూ కితాబు
టీమిండియా సూపర్ స్టార్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మాజీ సారథి విరాట్ కోహ్లీని ‘కింగ్ కోహ్లీ’ అంటూ అభిమానులు ఎందుకు సంబోధిస్తారో మరోసారి రుజువైంది. ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్ తో గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో కోహ్లీ బౌండరీ దగ్గర నుంచి చీతాలా పరుగు తీస్తూ చేసిన రనౌట్ మ్యాచ్ కే హైలైట్ గా నిలిచింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. దాన్ని చూసిన నెటిజన్లంతా నోరెళ్లబెడుతున్నారు.

బెంగళూరు నిర్దేశించిన 242 పరుగుల టార్గెట్ ను ఛేదించే క్రమంలో పంజాబ్ 14వ ఓవర్ నాటికి 150 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయింది. ఆ జట్టు విజయానికి 39 బంతుల్లో 92 పరుగులు కావాల్సి ఉంది. అయితే క్రీజ్ లో బ్యాటింగ్ చేస్తున్న పంజాబ్ కింగ్స్ జట్టు కెప్టెన్ శామ్ కర్రన్.. ఫెర్గ్యూసన్ బౌలింగ్ లో బంతిని డీప్ మిడ్ వికెట్ దిశగా నెమ్మదిగా ఆడాడు. ఫీల్డర్ బౌండరీ వద్ద ఉండటంతో రెండు పరుగులు తీద్దామనుకున్నాడు. తొలి పరుగు పూర్తి చేసి రెండో పరుగు కోసం పరిగెత్తాడు. అయితే రెండు పరుగును ఆపేందుకు కోహ్లీ మెరుపు వేగంతో పరిగెత్తాడు. బౌండరీ నుంచి సుమారు 65 అడుగులు పరిగెత్తుకుంటూ వచ్చి ఒక్క ఉదుటున బంతిని అందుకొని కింద పడిపోతూ ఒంటిచేత్తో వికెట్ల వైపు విసిరాడు. అది కాస్తా నేరుగా వికెట్లను తాకడంతో నాన్ స్ట్రైకర్ ఎండ్ వైపు పరిగెడుతున్న శషాంగ్ సింగ్ రనౌట్ అయ్యాడు.

బంతి నేరుగా వికెట్లను గిరాటేయగానే కోహ్లీ ఆనందంతో లేచి పరిగెత్తుతూ టీం సభ్యులతో సంబరాలు చేసుకున్నాడు. కోహ్లీ మ్యాజిక్ చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. కోహ్లీ చేసిన చీతా రనౌట్ ఇది అంటూ ‘ఎక్స్’లో ఓ యూజర్ కామెంట్ చేయగా కింగ్ కోహ్లీ ఆన్ ఫైర్ అంటూ మరొకరు కామెంట్ పోస్ట్ చేశారు. కోహ్లీ మానవమాత్రుడు కాడంటూ ఇంకొకరు కామెంట్ పెట్టారు.‘కోహ్లీ.. ఇక చాలు.. నీ వ్యతిరేకులను ఇవాళ కాస్తయినా నిద్ర పోనీ’ అని ఇంకొక అభిమాని రాసుకొచ్చాడు. మరొకరేమో ప్రపంచ కప్ కల సాకారం అవుతున్నట్లు కనిపిస్తోందని పేర్కొన్నాడు.


More Telugu News