ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దౌర్జన్యాల కేసులో మరో ట్విస్ట్!

  • కర్ణాటక ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణపై బలవంతంగా కేసు పెట్టించారన్న మహిళ
  • గురువారం మహిళ చెప్పిన విషయాన్ని మీడియాతో పంచుకున్న జాతీయ మహిళా కమిషన్
  • సిట్‌ దర్యాప్తుపై హెడ్ డీ కుమారస్వామి మండిపాటు
  • పోలీసు అధికారులు బాధితులను బెదిరిస్తున్నారని ఆగ్రహం
కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దౌర్జన్యం కేసులో తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. పోలీసులమని చెప్పుకుంటూ కొందరు తనతో బలవంతంగా రేవణ్ణపై కేసు పెట్టించారని బాధిత మహిళ ఒకరు ఆరోపించడం సంచలనంగా మారింది. మహిళ ఆరోపణల విషయాన్ని జాతీయ మహిళా కమిషన్ స్వయంగా గురువారం ప్రకటించింది. 

ఈ నేపథ్యంలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు హెచ్ డీ కుమారస్వామి గురువారం మండిపడ్డారు. కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం బాధితులను బెదిరిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఫిర్యాదులు చేయకపోతే వ్యభిచారం కేసులు పెడతామంటూ సిట్ ఆఫీసర్లు బాధితులపై బెదిరింపులకు దిగుతున్నారని మాజీ సీఎం ఆరోపించారు. 

‘‘కిడ్నాప్ చెర నుంచి కాపాడిన మహిళల్ని మీరు ఎక్కడ దాచారు? వారిని కోర్టులో ఎందుకు ప్రవేశపెట్టడం లేదు? బాధితుల ప్రైవేటు వీడియోలను ఇలా అందరికీ పంచడాన్ని మీరు సమర్థిస్తున్నారా?" అని రెవెన్యూ మంత్రి కృష్ణ బైరి గౌడను కుమారస్వామి ప్రశ్నించారు. తాను ప్రజ్వల్‌ను సమర్థించట్లేదని ఆయన స్పష్టం చేశారు. ‘‘ప్రతి ఒక్కరూ చట్టాన్ని గౌరవించాల్సిందే. దోషులకు శిక్ష పడాల్సిందే. హెడ్‌డీ దేవెగౌడకు నలుగురు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మా అందరికీ ఎవరి కుటుంబాలు, వ్యాపారాలు వారికి ఉన్నాయి. నేను అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఒకసారి మాత్రమే హసన్ జిల్లాకు వెళ్లాను’’ అని ఆయన అన్నారు. 

మరోవైపు, సిట్ దర్యాప్తును కర్ణాటక హోం మంత్రి జి.పరమేశ్వర సమర్థించారు. ప్రత్యేక దర్యాప్తు బృందం సమర్థవంతంగా కేసును దర్యాప్తు చేస్తోందని అన్నారు. జేడీఎస్ ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం లేదన్నారు. ‘‘ప్రతి ఒక్కరికీ నేను సమాధానం చెప్పలేను. సిట్‌పై ఏదైనా అభ్యంతరాలు ఉంటే కేసు ఫైల్ చేయమనండి. దర్యాప్తు జరుగుతోంది. పూర్తి వివరాలు తేలాక వాటిని ప్రజల ముందుంచుతాం. వీడియోల్లోని బాధితులను బ్లాక్ మెయిల్ చేసినట్టు తేలితే దోషులపై చర్యలు ఉంటాయి’’ అని ఆయన అన్నారు.


More Telugu News