మరి కొన్ని జిల్లాల పేరు మార్చనున్న యూపీ సీఎం!

  • అక్బర్‌పూర్, అలీగఢ్ సహా పలు జిల్లాల పేరు మార్పుకు సంకేతాలు
  • ఈ పేర్లతో ఇబ్బందులంటూ ఇటీవల సీఎం అధికారిక ప్రకటన
  • జిల్లా పేర్ల మార్పునకు పలు వర్గాల నుంచి డిమాండ్లు
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మరోసారి జిల్లాల పేర్లు మార్చనున్నారా? అంటే అవుననే అంటోంది స్థానిక మీడియా. ఇటీవలి ప్రభుత్వ ప్రకటనే ఇందుకు నిదర్శనంగా చెబుతోంది. ‘‘అక్బర్‌పూర్ పేరు ఇబ్బందిగా మారుతోంది. కానీ ఈ పరిస్థితిలో మార్పు వస్తుంది. వలస పాలన తాలుకు గుర్తులన్నీ తొలగించాలి. మన వారసత్వాన్ని, సంస్కృతులను గౌరవించాలి’’ అని సీఎం ఓ ప్రకటనలో వ్యాఖ్యానించారు. 

అక్బర్‌పూర్‌ నగరంతో పాటు అలీగఢ్, ఆజమ్‌గఢ్, షాజహాన్‌పూర్, ఘాజియాబాద్, ఫిరోజాబాద్, ఫరూఖాబాద్, మొరాదాబాద్ జిల్లాల పేర్లు మార్చే అవకాశం ఉన్నట్టు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. 

2017లో సీఎం బాధ్యతలు చేపట్టాక యోగి ఆదిత్యనాథ్ అనేక ప్రాంతాలు, నిర్మాణాల పేర్ల మార్పునకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని అనేక కట్టడాలు, వీధులు, పార్కులకు పాత పేర్ల స్థానంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి పేరిట నామకరణం చేశారు. 

దేశంలోనే నాలుగో అతిపెద్దదైన ముఘల్‌సరాయ్ రైల్వే స్టేషన్‌కు దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ జంక్షన్ గా నామకరణం చేశారు. 2019లో అలహాబాద్‌ పేరును ప్రయాగ్‌రాజ్‌గా మార్చారు. ఫైజాబాద్‌ను అయోధ్యగా, ఝాన్సీ రైల్వే స్టేషన్‌ పేరును రాణి లక్ష్మీబాయ్ స్టేషన్‌గా మార్చారు. 

మరోవైపు, అలీగఢ్‌ పేరు హరీగఢ్‌గా, ఫిరోజాబాద్‌ జిల్లా పేరును చంద్రనగర్‌గా మార్చాలంటూ స్థానిక జిల్లా పాలక సంస్థలు తీర్మానాలను ఆమోదించాయి. వలసపాలన గుర్తును తొలగించి భారతీయ వారసత్వాన్ని పునరుద్ధరించాలని ప్రధాని మోదీ గతంలో ఇచ్చిన పిలుపుమేరకు సీఎం యోగి పలు చర్యలు తీసుకుంటున్నారు. 


More Telugu News