ఆర్‌సీబీ ప్లేఆఫ్స్ ఆశ‌లు స‌జీవం.. ఐపీఎల్ నుంచి పంజాబ్ ఔట్‌!

  • ధ‌ర్మ‌శాల వేదిక‌గా పంజాబ్ కింగ్స్, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు మ్యాచ్‌
  • త‌ప్ప‌క గెల‌వాల్సిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 60 ప‌రుగుల తేడాతో బంప‌ర్ విక్ట‌రీ
  • 47 బంతుల్లోనే 7 ఫోర్లు, 6 సిక్సర్లతో 92 ర‌న్స్ బాదిన విరాట్ కోహ్లీ
  • రూసో హాఫ్ సెంచ‌రీ (61) వృథా
ధ‌ర్మ‌శాల వేదిక‌గా పంజాబ్ కింగ్స్ తో జ‌రిగిన మ్యాచ్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు ఘ‌న విజ‌యం సాధించింది. త‌ప్ప‌క గెల‌వాల్సిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 60 ప‌రుగుల తేడాతో గెలుపొందింది. దీంతో ప్లేఆఫ్స్ ఆశ‌ల‌ను స‌జీవంగా ఉంచుకుంది. 242 ప‌రుగుల భారీ ల‌క్ష్య‌ఛేద‌న‌తో బ‌రిలోకి దిగిన పీబీకేఎస్ 17 ఓవ‌ర్ల‌లో 181 ప‌రుగుల‌కే ఆలౌటైంది. ఆ జ‌ట్టు బ్యాట‌ర్ల‌లో రూసో హాఫ్ సెంచ‌రీ (61), శ‌శాంక్ సింగ్ (37) మాత్ర‌మే రాణించారు. మిగ‌తా బ్యాట‌ర్లు చేతులెత్తేశారు. బెంగ‌ళూరు బౌల‌ర్ల‌లో మ‌హ్మ‌ద్ సిరాజ్ 3 వికెట్లు తీయ‌గా.. ఫెర్గ్యూస‌న్‌, స్వ‌ప్నిల్ సింగ్‌, క‌ర్ణ్ శ‌ర్మ చెరో 2 వికెట్లు ప‌డ‌గొట్టారు. 

అంత‌కుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 241 పరుగుల భారీ స్కోరు బాదింది. ఓపెనర్ విరాట్ కోహ్లీ మ‌రోసారి విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. మ‌రో ఓపెన‌ర్ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ (9) త్వరగానే పెవిలియ‌న్ చేరినప్పటికీ, విరాట్‌ పరుగుల వ‌ర‌ద పారించాడు. మొత్తం 47 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ 7 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో ఏకంగా 92 పరుగులు చేశాడు. మరోవైపు రజత్ పాటీదార్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవ‌లం 23 బంతులు ఎదుర్కొన్న పాటీదార్‌ 3 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 55 పరుగులు బాదాడు. 

ఇక చివ‌రి వ‌ర‌కు క్రీజులో ఉన్న‌ ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ కూడా బ్యాట్ ఝుళిపించాడు. 27 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్‌తో 46 పరుగులు చేసి త్రుటిలో హాఫ్ సెంచ‌రీ చేజార్చుకున్నాడు. చివ‌ర్లో ఎప్ప‌టిలానే దినేశ్ కార్తీక్ మ‌రోసారి ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ తో పంజాబ్ బౌల‌ర్ల‌ను హ‌డ‌లెత్తించాడు. 7 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్ లు బాదిన కార్తీక్‌ 18 పరుగులు పిండుకున్నాడు. పీబీకేఎస్‌ బౌలర్లలో హర్షల్ పటేల్ 3, కావేరప్ప 2, అర్షదీప్ సింగ్, కెప్టెన్ శామ్ కరన్ త‌లో వికెట్ ప‌డ‌గొట్టారు.  

అనంత‌రం 242 పరుగుల భారీ లక్ష్యఛేదనతో బ‌రిలోకి దిగిన‌ పంజాబ్ ఏ ద‌శ‌లోనూ టార్గెట్ వైపు కొన‌సాగ‌లేదు. ఆరంభంలోనే వికెట్ చేజార్చుకుంది. 6 పరుగులు చేసిన ఓపెనర్ ప్రభ్ సిమ్రన్ సింగ్ తొలి ఓవర్లోనే అవుటయ్యాడు. ఆ త‌ర్వాత రూసో, బెయిర్ స్టో ఇన్నింగ్స్‌ను చ‌క్క‌దిద్దారు. ఈ ఇద్ద‌రూ రెండో వికెట్‌కు 65 ప‌రుగుల చ‌క్క‌టి భాగ‌స్వామ్యం అందించారు. 16 బంతుల్లో 27 ప‌రుగులు చేసిన బెయిర్ స్టో ఫెర్గ్యూస‌న్ బౌలింగ్‌లో డుప్లెసిస్‌కు క్యాచ్ ఇచ్చి అవుట‌య్యాడు. 

అనంత‌రం క్రీజులోకి వ‌చ్చిన శ‌శాంక్ సింగ్ కొద్దిసేపు ఆర్‌సీబీ బౌల‌ర్ల‌ను నిలువ‌రించాడు. ధాటిగా బ్యాటింగ్ చేసిన 19 బంతుల్లో 4 బౌండ‌రీలు, 2 సిక్స‌ర్ల‌తో 37 ప‌రుగులు చేసి, కోహ్లీ మెరుపు ఫీల్డింగ్ కార‌ణంగా ర‌నౌట్‌గా వెనుదిరిగాడు. అనంత‌రం జితేశ్ శ‌ర్మ (5), లివింగ్ స్టోన్(0), శామ్ క‌ర‌న్‌(22) వెంట‌వెంట‌నే ఔట్ కావ‌డంతో పంజాబ్ ప‌రాజ‌యం ఖాయ‌మైంది. చివ‌రికి పీబీకేఎస్ 17 ఓవ‌ర్ల‌లో 181 ప‌రుగుల‌కే చాప‌చుట్టేసింది. 47 బంతుల్లో 92 ప‌రుగులు చేసిన విరాట్ కోహ్లీ ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.     
ఐపీఎల్ నుంచి పంజాబ్ కింగ్స్ ఔట్‌
ఆర్‌సీబీతో జ‌రిగిన మ్యాచ్‌లో ఘోర ప‌రాజ‌యంతో పంజాబ్ కింగ్స్ నాకౌట్ రేసు నుంచి అధికారికంగా నిష్క్ర‌మించింది. ఈ సీజ‌న్‌లో ఎలిమినేట్ అయిన రెండో జ‌ట్టుగా పంజాబ్ నిలిచింది. ఆ జ‌ట్టు ఇప్ప‌టివ‌ర‌కు 12 మ్యాచులు ఆడి నాలుగింటిలో మాత్ర‌మే గెలిచింది. దీంతో పాయింట్ల ప‌ట్టిక‌లో చివ‌రి నుంచి రెండో స్థానంలో ఉంది. లీగ్ ద‌శ‌లోనే నాకౌట్ రేసు నుంచి వైదొల‌గ‌డం పంజాబ్‌కు ఇది 15వ సారి కావ‌డం గ‌మ‌నార్హం. కేవ‌లం ఒకే ఒక్క‌సారి ఫైన‌ల్‌కు వెళ్లింది. ఇక పీబీకేఎస్ కంటే ముందు ఈ సీజ‌న్‌లో లీగ్ స్టేజ్‌లోనే నిష్క్ర‌మించిన తొలి జ‌ట్టు ముంబై ఇండియ‌న్స్ అనే విష‌యం తెలిసిందే.


More Telugu News