రాజకీయాల్లో ఉన్నప్పుడు నాకు అత్యంత సంతృప్తిని ఇచ్చింది అదే: చిరంజీవి

  • చిరంజీవికి పద్మ విభూషణ్
  • చిరంజీవి, కిషన్ రెడ్డి మధ్య ఆత్మీయ ముఖాముఖి
  • కిషన్ రెడ్డిని తన చిరకాల మిత్రుడిగా పేర్కొన్న చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మధ్య ఆత్మీయ భేటీ జరిగింది. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి... చిరంజీవి మధ్య ముఖాముఖి చర్చ జరిగింది. తెలుగు చిత్ర పరిశ్రమలో అక్కినేని నాగేశ్వరరావు తర్వాత పద్మ విభూషణ్ తీసుకున్నది మీరే... అది మాకందరికీ గర్వకారణం... మిమ్మల్ని నా తరఫున, ప్రజల తరఫున, కేంద్ర ప్రభుత్వం తరఫున అభినందిస్తున్నానని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. 

45 ఏళ్ల సినీ జీవితంలో పునాదిరాళ్లు వేసుకుని స్వయంకృషితో ఎదుగుతూ వస్తున్నారని కొనియాడారు. ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చిన మీకు ఈరోజున కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అందిస్తుండడం ప్రతి తెలుగు బిడ్డ గర్వించదగ్గ అంశం అని భావిస్తున్నానని కిషన్ రెడ్డి వివరించారు. 

ఈ సందర్భంగా చిరంజీవి వినమ్రంగా చేతులు జోడించి ధన్యవాదాలు తెలిపారు. "పద్మ విభూషణ్ వచ్చిన ఈ సందర్భంలో నన్ను అభినందించడానికి నా స్నేహితుడిగా, చిరకాల మిత్రుడిగా మీరు రావడం చాలా సంతోషం కలిగించింది. మీ ప్రేమను, అభిమానాన్ని ఆస్వాదిస్తున్నాను" అంటూ చిరంజీవి బదులిచ్చారు.

ఇంటర్వ్యూలో చిరంజీవి వ్యాఖ్యల్లో కొన్ని...

  • ఇండస్ట్రీ లేకపోతే మేం లేం... నా చదువుకు, నా బ్యాక్ గ్రౌండ్ కు ఏదో మారుమూలన ఒక ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాడ్ని. ఇవాళ సెలబ్రిటీ స్థాయి రావడం కానీ, ప్రపంచంలో ఎక్కడ మనవాళ్లు ఉంటే అక్కడ నాకు గుర్తింపు రావడం కానీ ఇండస్ట్రీ నాకు పెట్టిన భిక్షగానే భావిస్తాను. 
  • నాకు ఇన్ని ఇచ్చిన ఇండస్ట్రీకి ఏదైనా తిరిగి ఇవ్వాలని పరితపిస్తాను. అందుకే ఇండస్ట్రీకి ఏదైనా సంక్షోభం వస్తే నా వంతు భుజం కాయాలి, నా తోడ్పాటు అందించాలని తప్పకుండా కోరుకుంటాను. 
  • ఒక ఇంటికి పెద్ద కొడుకు ఎలా అండగా ఉంటాడో అలా నేను చిత్ర  పరిశ్రమ కోసం నిలబడాలని కోరుకుంటాను కానీ, ప్రతిదానికీ పెద్దను నేను అనే రీతిలో భేషజాలకు పోను.
  • ఆర్టిస్ట్ గా నేను ఉన్నతస్థితిలో ఉన్న సమయంలో రాజకీయాల్లోకి వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలకు ఏదో చేయాలనే తపన తప్ప పదవులపై దృష్టి లేదు. 
  • ప్రజలు అన్నింటిని మించిన ఉన్నత స్థానం ఇచ్చినప్పుడు, అంతకుమించి ఇంకేదో కావాలని కోరుకోలేదు. 
  • బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు తదితర సామాజిక కార్యక్రమాలతో ప్రజలకు సేవ చేస్తున్నప్పుడు, భగవంతుడు ఇంకా పెద్ద ఎత్తున చేసే అవకాశం ఇస్తే మనసా వాచా కర్మణా చిత్తశుద్ధితో చేయాలి అని కోరుకున్నాను. ఆ విధంగా ప్రజల పట్ల కృతజ్ఞత చాటుకోవాలి అని అనుకునేవాడ్ని.
  • నేను రాజకీయాల్లో ఉన్నప్పుడు నాకు అత్యంత సంతృప్తిని ఇచ్చింది కేంద్ర టూరిజం మంత్రిగా ఉన్నప్పుడు. రాజకీయాల్లోకి వస్తే ఇంత చేయొచ్చా అని సుస్పష్టంగా, అనుభవపూర్వకంగా తెలిసి వచ్చింది అప్పుడే.
  • తిరుపతిలో కలినరీ ఇన్ స్టిట్యూట్ ను తీసుకురావడానికి చాలా శ్రమించాను. అందుకోసం నేను ఒక స్టార్ ని, ఒక మంత్రిని అనేది మర్చిపోయి నాటి ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్ మాంటెక్ సింగ్ అహ్లూవాలియా వద్ద చేతులు కట్టుకుని నిలబడి సాధించుకొచ్చాను. 
  • అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో నేను మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఆ కలినరీ ఇన్ స్టిట్యూట్  ను ముందుకు తీసుకెళ్లింది.
  • నాడు ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు సభలోకి అడుగుపెట్టగానే.. ఒకవైపున మీరు (కిషన్ రెడ్డి), మరోవైపున జయప్రకాశ్ నారాయణ, ఇటు చంద్రబాబు, అటు వైఎస్సార్ వంటి ఉద్ధండులు ఉండేవారు.
  • అసెంబ్లీలో ఒకరినొకరు తిట్టుకోవడం చూశాను. అంత తీవ్రంగా దూషించుకున్నాక ఒకరితో ఒకరు ఇంకెప్పుడూ మాట్లాడుకోరు అనిపించేది. కానీ సభ బయట పరిణామాలు చూసి దిగ్భ్రాంతికి గురయ్యాను. అసెంబ్లీలో ఎవరైతే తిట్టుకున్నారో, బయట వాళ్లిద్దరే మాట్లాడుకుంటూ కనిపించేవాళ్లు. నువ్వేంది భయ్యా అంత మాట అన్నావు అని ఒకరంటే... నువ్వు అనలేదా అని మరొకరు... మా నాయకుడు చూస్తున్నాడు కాబట్టి అలా అనాల్సి వచ్చింది భయ్యా... అంటూ వారు మాట్లాడుకునే మాటలు నాకు షాక్ కలిగించేవి.
  • జీ-20 సదస్సుకు రామ్ చరణ్ హాజరు కావడం చాలా సంతోషం కలిగించింది. అప్పుడే ఆర్ఆర్ఆర్ తో రామ్ చరణ్ మాంచి ఊపుమీదున్నాడు. ఆ సమయంలో జీ-20 వంటి అంతర్జాతీయ సదస్సుకు హాజరుకావడం మంచి పరిణామం అనిపించింది.
  • కశ్మీర్ లో ఇప్పుడు భారత జెండా రెపరెపలాడడం సంతోషదాయకం. 


More Telugu News