కులగణన చేస్తాం... పేదల లిస్ట్ తీసి ఒక్కో మహిళ ఖాతాలో రూ.1 లక్ష జమ చేస్తాం: రాహుల్ గాంధీ

  • కులగణన చేస్తే ఎవరు ఎంతమందో తేలుతుందన్న రాహుల్ గాంధీ
  • దేశంలోని పేదలందరి జాబితాను తయారు చేస్తామన్న కాంగ్రెస్ అగ్రనేత
  • రాజ్యాంగం వల్లే పేదలకు హక్కులు దక్కాయన్న రాహుల్ గాంధీ
  • పంద్రాగస్ట్ లోగా తెలంగాణలో రుణమాఫీ చేస్తామని హామీ
దేశంలో కులగణన చేస్తే ఎవరు ఎంతమంది ఉన్నారో తేలుతుందని... ఆ తర్వాత పేదలను ఎంపిక చేసి ఒక్కో కుటుంబం నుంచి ఒక్కో మహిళకు ఏడాదికి లక్ష రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. నర్సాపూర్‌లో కాంగ్రెస్ ప్రచార సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశంలో కులగణన చేస్తుందని హామీ ఇచ్చారు.

వివిధ వర్గాలు ఎంతనో తేలితే... అప్పుడు అసలైన రాజకీయం మొదలవుతుందని వ్యాఖ్యానించారు. తాము దేశంలోని పేదలందరి జాబితాను తయారు చేస్తామని... ప్రతి పేద కుటుంబం నుంచి ఓ మహిళను ఎంచుకొని... ఆ మహిళకు ఏడాదికి రూ.1 లక్ష జమ చేస్తామన్నారు. అంటే నెలకు రూ.8500 వస్తాయన్నారు. దీంతో పేదల జీవితాలు మారిపోతాయని పేర్కొన్నారు. ఈ పథకంతో భారతదేశ ఆర్థిక వ్యవస్థ జంప్ అవుతుందని జోస్యం చెప్పారు. ప్రధాని మోదీ ఈ పదేళ్లలో ఎంత అయితే కోటీశ్వరులకు ఇచ్చారో తాము అంతేమొత్తాన్ని పేదలకు పంచుతామని తెలిపారు.

రాజ్యాంగం వల్లే పేదలకు హక్కులు దక్కాయి

రాజ్యాంగం వల్లే పేదలకు హక్కులు దక్కాయన్నారు. స్వాతంత్ర్యం, రాజ్యాంగం కోసం ఎంతో మంది ప్రాణత్యాగం చేశారని పేర్కొన్నారు. బీజేపీ నేతలు రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని, బయటపారేస్తామని అంటున్నారని మండిపడ్డారు. రాజ్యాంగానికి ముందు దేశంలో పేదలకు ఎలాంటి హక్కులు లేకుండా ఉండేదన్నారు. దేశంలో వెనుకబడిన వర్గాలు, దళితుల హక్కులను రాజ్యాంగం రక్షిస్తోందని పేర్కొన్నారు. రెండు సిద్ధాంతాల మధ్య ప్రస్తుత ఎన్నికలు జరుగుతున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని రక్షిస్తుందని... మరెవరినీ రాజ్యాంగాన్ని రద్దు చేయనీయదని హామీ ఇచ్చారు. మీకు దక్కిన హక్కు రాజ్యాంగం వల్ల వచ్చిందనని సభకు వచ్చినవారిని ఉద్దేశించి అన్నారు. విద్య, ఉద్యోగాలు, ఓటు హక్కు అన్నీ రాజ్యాంగం ద్వారా వచ్చినవే అన్నారు.

ప్రభుత్వరంగ సంస్థలను ప్రధాని మోదీ ప్రైవేటుపరం చేస్తున్నారని ఆరోపించారు. దేశంలో పెట్టుబడిదారి వ్యవస్థను పెంచి పోషిస్తున్నారన్నారు. రిజర్వేషన్లను తొలగించేందుకు మోదీ ప్రైవేటైజేషన్ చేస్తున్నారని ఆరోపించారు. దేశంలో కేవలం 2 శాతం ఉన్న వాళ్ల చేతిలో సంపద ఉందన్నారు. ప్రధాని మోదీ దేశంలోని విమానాశ్రయాలను, పోర్టులను అదానీపరం చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ నేతలు రాజ్యాంగాన్ని రద్దు చేస్తామంటే మేం 50 శాతానికి పైగా పెంచుతామని చెబుతున్నామన్నారు. తన పదేళ్ల కాలంలో మోదీ 25 మందిని ట్రిలియనీర్లుగా తయారు చేశారన్నారు.

పంద్రాగస్ట్ లోగా రుణమాఫీ చేస్తాం

మోదీ దేశంలోని యువతను నిరుద్యోగులుగా మార్చారని ఆరోపించారు. అదానీ కోసం పెద్ద నోట్ల రద్దు చేశారన్నారు. నరేంద్ర మోదీ రైతులను వేధించారని ఆరోపించారు. తాము అధికారంలోకి రాగానే మొదట చేసే పని రైతు రుణమాఫీ అని హామీ ఇచ్చారు. తెలంగాణలో పంద్రాగస్ట్‌లోగా రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. ఇక్కడ మీ కోసం ప్రభుత్వం పని చేస్తోందని... ఢిల్లీలో తాను సైనికుడిలా పని చేస్తానన్నారు. ద్వేషపు బజారులో ప్రేమ దుకాణాన్ని తెరవడానికే తాము వచ్చామన్నారు.


More Telugu News