ఐదునెలల్లోనే కాంగ్రెస్​ పై ప్రజావ్యతిరేకత: మాజీ మంత్రి హరీశ్​ రావు

  • నా సవాల్ ను స్వీకరించకుండా రేవంత్ సొల్లు కబుర్లు చెబుతున్నారని ఎద్దేవా
  • మోదీ సర్కారు కార్పొరేట్ శక్తులకు అనుకూలమని వెల్లడి
  • మెదక్ లో బీఆర్ ఎస్ అభ్యర్థి గెలుపు ఖాయమని ధీమా
ఎన్నికలకు ముందు అలవికాని హామిలిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయలేక ఐదు నెలల కాలంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రజావ్యతిరేకతను కూడగట్టుకుందని మాజీ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కారు తెలంగాణకు నిధులివ్వకుండా మొండి చేయి చూపించిందని ఆయన విమర్శించారు. నరేంద్ర మోదీ సర్కారు కార్మికులకు వ్యతిరేకంగా, కార్పొరేట్ వర్గాలకు అనుకూలంగా పనిచేస్తోందని ధ్వజమెత్తారు. బీజేపీ చేస్తున్న మత రాజకీయాలు తెలంగాణలో ప్రజలు చెల్లనివ్వరని హరీశ్ రావు హెచ్చరించారు. 

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వందరోజుల్లోనే ఆరుగ్యారంటీలు అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ పవర్ లోకి వచ్చి ఐదు నెలలైనా ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయడం లేదని హరీశ్ రావు విమర్శించారు. తీరా పార్లమెంట్ ఎన్నికలు రావడంతో ఎలక్షన్ కోడ్ అడ్డొస్తుందని, దేవుళ్ల మీద ఒట్లు పెడుతూ రేవంత్ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఆగస్టు 15 లోగా ఆరు గ్యారంటీలు, రుణమాఫీ చేస్తే తాను రాజీనామా చేస్తానన్న సవాల్ ను రేవంత్ రెడ్డి స్వీకరించకుండా కల్లబొల్లి మాటలు చెబుతూ కాలం వెళ్లబుచ్చుతున్నారని దుయ్యబట్టారు. మెదక్ లో బీఆర్ ఎస్ అభ్యర్థి వెంకట్రాంరెడ్డి అత్యధిక మెజార్టీతో గెలుస్తారని హరీశ్ రావు  ధీమా వ్యక్తం చేశారు.


More Telugu News