పవన్ కల్యాణ్ ను కలిసి ఆశీస్సులు అందుకున్న గుంటూరు టీడీపీ అభ్యర్థి గళ్లా మాధవి

  • గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా గళ్లా మాధవి
  • మంగళగిరిలో జనసేన కార్యాలయానికి వెళ్లి పవన్ కల్యాణ్ తో భేటీ
  • గళ్లా మాధవి గెలుపు తన చెల్లెలి గెలుపు వంటిదని వ్యాఖ్యలు
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గళ్లా మాధవి నేడు జనసేనాని పవన్ కల్యాణ్ ను కలిసి మద్దతు కోరారు. ఈ సందర్భంగా పవన్ ఆమెకు ఆశీస్సులు అందించారు. గళ్లా మాధవిని గెలిపించాలని జనసైనికులకు పిలుపునిచ్చారు. 

గళ్లా మాధవికి జనసేన నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందని భరోసా ఇచ్చారు. గళ్లా మాధవి గెలుపును నా చెల్లెలి గెలుపుగా భావిస్తాను అని పేర్కొన్నారు. రాష్ట్రంలో కూటమి అభ్యర్థుల విజయం కోసం జనసేన శ్రేణులు కృషి చేయాలని కోరారు. 

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారని అన్నారు. 

ఈ ఎన్నికల్లో తమను గెలిపిస్తే తర్వాత జనసేన, టీడీపీ పార్టీల్లో చేరతామని గుంటూరు, కాకినాడ వంటి ప్రాంతాల్లో వైసీపీ అభ్యర్థులు అంటున్నారని, అలాంటి మోసపూరిత మాటలు నమ్మవద్దని జనసేన నేతలు, కార్యకర్తలకు సూచించారు. మనం కూటమి ధర్మం ప్రకారం వ్యవహరిద్దాం... జనసేన-టీడీపీ-బీజేపీ కూటమి అభ్యర్థులకే మన ఓటు అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.


More Telugu News