ముంబై క‌థ ముగిసింది.. ప్లేఆఫ్స్​ రేసులో ఇతర జట్ల అవకాశాలు ఇలా..!

  • నిన్న ల‌క్నోపై హైదరాబాద్ భారీ విజ‌యంతో ముంబై అధికారికంగా టోర్నీ నుంచి ఔట్‌
  • ఈ ఐపీఎల్ సీజ‌న్ లీగ్ దశలో ఇంకా మిగిలి ఉన్న మ్యాచులు ప‌ద‌మూడే
  • కానీ ఇప్పటివరకు ఏ జ‌ట్టు కూడా అధికారికంగా ప్లేఆఫ్స్ కు అర్హత సాధించని వైనం
ఐపీఎల్ 17వ సీజ‌న్‌ లీగ్‌ దశ ర‌స‌వ‌త్త‌రంగా కొన‌సాగుతోంది. లీగ్ ద‌శ చివ‌రికి రావ‌డంతో ఏ జ‌ట్టు ప్లేఆఫ్స్ కు వెళ్తుంది? ఏ జ‌ట్టు ఇంటికి వెళ్తుంది? అనే టెన్ష‌న్ క్రికెట్ అభిమానుల‌కు ప‌ట్టుకుంది. ఇక ఈసారి ఐపీఎల్‌లో బౌలర్ల కంటే బ్యాటర్లు మాత్రం చెల‌రేగి పోతున్నారు. దీంతో మ్యాచులన్నీ దాదాపుగా ఏకపక్షంగా కొన‌సాగుతున్నాయి. అయితే, ఈ సీజన్ లీగ్ దశలో ఇంకా 13 మ్యాచులే మిగిలి ఉన్నాయి. కానీ ఇప్పటివరకు ఏ జ‌ట్టు కూడా అధికారికంగా ప్లేఆఫ్స్ కు అర్హత సాధించలేదు.

కాగా, లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్‌జీ) పై సన్‌రైజర్స్‌ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్‌) విజయం సాధించడంతో ముంబై ఇండియన్స్ (ఎంఐ) అధికారికంగా టోర్నీ నుంచి వైదొలిగినట్టైంది. ముంబై ఇప్ప‌టివ‌ర‌కు 12 మ్యాచుల్లో కేవలం 4 విజయాలు మాత్రమే సాధించి 8 పాయింట్లు ఖాతాలో వేసుకుంది. దీంతో ఆ జట్టుకు ముందంజ వేసే అవ‌కాశాలు ఇక లేవ‌నే చెప్పాలి. దీంతో ఈ సీజ‌న్‌లో ఎలిమినేట్ అయిన తొలి జ‌ట్టుగా ముంబై నిలిచింది. కాగా, హార్దిక్ పాండ్యా సారథ్యంలో ముంబై ఇండియ‌న్స్ ఈసారి ఘోర ప్ర‌ద‌ర్శ‌న‌తో అభిమానుల‌ను తీవ్రంగా నిరాశ‌ప‌రిచింది. 

ఇక ప్రస్తుతం చెరో 12 పాయింట్లతో కొనసాగుతున్న లక్నో, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఓ మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఎవరు గెలిచినా కూడా ఆ పాయింట్లు 14 అవుతాయి. ఒకవేళ అది రద్దైనా కూడా 13 పాయింట్లతో ఎంఐ కన్నా మెరుగైన స్థితిలో ఆ రెండు జట్లు ఉంటాయి. ఇక మిగ‌తా తొమ్మిది జట్లు కూడా ప్లేఆఫ్స్ రేసులోనే ఉన్నాయి.

అయితే, 11 మ్యాచుల్లో ఎనిమిదేసి విజయాలు, 16 పాయింట్లతో మొదటి రెండు స్థానాల్లో ఉన్న కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ (కేకేఆర్), రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌ (ఆర్ఆర్) ప్లేఆఫ్స్‌ చేరడం దాదాపు ఖాయం. ఇంకొక్క విజయం సాధిస్తే ఈ రెండు జ‌ట్లు ఎలాంటి స‌మీక‌ర‌ణాల‌తో అవ‌స‌రం లేకుండా నేరుగా ప్లేఆఫ్స్ చేర‌తాయి.

ఇక ల‌క్నోపై నిన్న‌టి మ్యాచ్‌లో భారీ విజయంతో నెట్‌ రన్‌రేట్‌ను పెంచుకున్న సన్‌రైజర్స్‌ కూడా ప్లేఆఫ్స్‌ రేసుకు మరింత చేరువైంది. ఇప్ప‌టివ‌ర‌కు 12 మ్యాచులు ఆడి ఏడు విజయాలతో మూడో స్థానంలో ఉన్న సన్ రైజర్స్ మరో మ్యాచులో గెలిస్తే మరింత ముందుకు వెళ్తుంది. పైగా తన చివరి రెండు మ్యాచులను (గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్‌తో) సొంత మైదానంలోనే ఆడనుంది. ఇది ఆ జట్టుకు బాగా కలిసొచ్చే అంశం. సో.. ఎస్ఆర్‌హెచ్ ప్లేఆఫ్స్ వెళ్లేందుకు అవ‌కాశం ఉంది.


More Telugu News