అనుభవించలేని ఆస్తులు ఎందుకు?: ఆర్పీ పట్నాయక్

  • ఆత్మహత్యలపై స్పందించిన ఆర్పీ పట్నాయక్ 
  • ఆస్తుల గొడవలే ప్రధాన కారణమని వ్యాఖ్య 
  • పిల్లలు వాళ్ల కాళ్లపై వాళ్లు నిలబడేలా చేయాలని వెల్లడి 
  • తన ఆస్తిపై పిల్లలు ఆధారపడితే తాను ఫెయిలైనట్టేనని వివరణ

ఆర్పీ పట్నాయక్ .. ఒకానొక సమయంలో సంగీత దర్శకుడిగా ఆయన తన జోరును చూపించారు. తెలుగు సినిమా పాటకు కొత్త నడకలు నేర్పారు. అలాంటి ఆర్పీ పట్నాయక్ తాజాగా ఒక యూ ట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. "జీవితం చాలా చిన్నది .. ఎంతో అందమైనది కూడా. ఉన్న ఈ కొన్ని రోజులను ఆనందంతో గడపకుండా చాలామంది ఆత్మహత్యలు చేసుకోవడం నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది" అన్నారు. 

"నేను గమనించినంత వరకూ అక్రమ సంబంధాల కారణంగా .. భూ తగాదాల కారణంగా ఎక్కువమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అనిపించింది. చాలామంది అక్కడ అన్ని ఎకరాలు ఉన్నాయి .. ఇక్కడ ఇన్ని ఎకరాలు ఉన్నాయని చెప్పుకుంటూ ఉంటారు. అలాంటివారిని చూసినప్పుడు నిజంగా నాకు చాలా జాలి కలుగుతుంది" అని చెప్పారు. 

"ఎక్కడ ఎన్ని ఎకరాలు ఉండటం వలన ఏంటి ప్రయోజనం? మనకి ఒక ఇల్లు ఉంటే దాంట్లో ఉంటూ అనుభవిస్తున్నాం. ఒక వస్తువును కొంటే దానిని ఉపయోగిస్తూ అనుభవిస్తున్నాం. కానీ ఎక్కడో వంద ఎకరాలు కొనేసి వాటి తాలూకు పేపర్లు చూసుకుని మురిసిపోవడం వలన ఏం వస్తుంది? అనుభవించలేని ఆస్తులు ఎందుకు? అని అన్నారు. 

" ఒకతను నన్ను అడిగాడు .. నీ పిల్లలకు నువ్వు ఏమీ ఇవ్వకపోతే రేపు ఎట్లా? అని. ఆ వ్యక్తికి నేను ఒక్కటే మాట చెప్పాను. నా పిల్లలకి వాళ్ల కాళ్లపై వాళ్లు నిలబడేలా నేను చేశానని అనుకుంటున్నాను. అలా కాకుండా నా పిల్లలు నా ఆస్తిపై బ్రతికే పరిస్థితిలో ఉంటే పెంపకం పరంగా నేను ఫెయిలైపోయినట్టే అని అన్నాను" అని చెప్పారు.


More Telugu News