ముదిరిన వివాదం.. సిక్ లీవ్ పెట్టిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సిబ్బందిపై వేటు!

  • ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ తీరుపై విమానం క్రూ గుస్సా
  • ప్రమోషన్లు, జీతాల విషయంలో న్యాయం జరగట్లేదని ఫిర్యాదు
  • మంగళవారం మూకుమ్మడిగా సిక్ లీవ్ తీసుకున్న క్రూ 
  • భారీగా ఫ్లైట్ల రద్దు, 15 వేల మంది ప్రయాణికులపై ప్రభావం
  • లీవ్ పెట్టిన ఉద్యోగుల్లో కొందరిని తొలగించిన ఎయిర్‌లైన్స్
ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, విమానం క్రూ మధ్య వివాదం ముదురుతోంది. ఇటీవల మూకుమ్మడి సెలవులు పెట్టి సేవల అంతరాయానికి కారణమైన 25 మంది క్రూ సిబ్బందిని సంస్థ తాజాగా తొలగించింది. సంస్థ సర్వీస్ రూల్స్ ఉల్లంఘించిన కారణంగా తక్షణం వారిని తొలగిస్తున్నట్టు పేర్కొంది. సరైన కారణం లేకపోయినా కావాలనే  సెలవు పెట్టారని, ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఇదంతా చేశారని ఉద్యోగులకు రాసిన లేఖలో సంస్థ పేర్కొంది. సంస్థ మరిన్ని తొలగింపులు చేపట్టే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది. 

మంగళవారం ఒకేసారి 300 మంది విమానం క్రూ (సిబ్బంది) అనారోగ్య సెలవులు పెట్టడంతో ఏకంగా 100కి పైగా ఫ్లైట్ సర్వీసులు రద్దయ్యాయి. ఫలితంగా, మంగళ బుధవారాల్లో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దీనిపై ప్రభావం దాదాపు 15 వేల మంది ప్రయాణికులపై పడింది. టాటా గ్రూప్‌కు చెందిన ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌పై క్రూ కొంతకాలంగా గుర్రుగా ఉన్నారు. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్.. ఏఐఎక్స్ కనెక్ట్ సంస్థతో విలీనం అవుతున్న నేపథ్యంలో కొత్త నిబంధనలపై క్రూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులతో సంస్థ సమభావంతో వ్యవహరించట్లేదని, ఉన్నత బాధ్యతలకు అర్హత ఉన్నా దిగువ స్థానాలకే కొందరిని పరిమితం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. తమ పారితోషికానికి సంబంధించి నిబంధనల్లో మార్పులను కూడా నిరసిస్తున్నారు. టాటాకు చెందిన విస్తారా ఎయిర్‌లైన్స్‌లో పైలట్ల జీతాలపై వివాదం ముగిసిన కొద్ది రోజులకే ఈ వివాదం తలెత్తడం ప్రాధాన్యం సంతరించుకుంది. 

క్రూ సిబ్బంది మూకుమ్మడి సెలవుల నేపథ్యంలో ప్రయాణికులకు ఇబ్బందులు రాకుండా అనేక ఏర్పాట్లు చేస్తున్నట్టు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ పేర్కొంది. తన ఫ్లైట్ రద్దైందీ లేనిదీ ఓసారి చెక్ చేసుకున్నాకే ప్రయాణికులు ఎయిర్‌పోర్టుకు రావాలని సూచించింది. 

అయితే, ఉద్యోగుల ప్రతినిధిగా చెప్పుకుంటున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఉద్యోగుల యూనియన్  తాజా పరిణామాలపై సంస్థకు లేఖ రాసింది. సంస్థ తన బాధ్యతల నుంచి పక్కకు తప్పుకుంటోందని పేర్కొంది. యాజమాన్య లోపాలు, ఉద్యోగులపట్ల సమభావంతో వ్యవహరించకపోవడం వంటి ఆరోపణలు చేసింది. అయితే, తాము ఈ యూనియన్‌ను గుర్తించేది లేదని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ పేర్కొంది. 

ఈ పరిణామాలపై లేబర్ కమిషనర్ కూడా స్పందించారు. ఎయిర్ ఇండియా చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్‌ సహా ఇతరులకు రాసిన లేఖలో లేబర్ కమిషనర్ అనేక కార్మిక చట్టాలను ఇష్టారీతిన ఉల్లంఘించిన విషయాన్ని ప్రస్తావించారు. ఉద్యోగ యూనియన్ల ఆందోళనలు వాస్తవమని పేర్కొన్నారు. ఉద్యోగులతో రాజీ చర్చలకు మేనేజ్‌మెంట్.. సరైన అధికారాలున్న వారిని పంపలేదని పేర్కొన్నారు. సంస్థ హెచ్‌ఆర్ విభాగం లేబర్ చట్టాలకు మూర్ఖపు నిర్వచనాలు ఇస్తూ కన్సీలియేషన్ అధికారిని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసిందన్నారు. సమస్య సామరస్య పరిష్కారానికి ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని యాజమాన్యానికి సూచించారు.


More Telugu News