సన్‌రైజర్స్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ వీరబాదుడికి బద్దలైన రికార్డుల లిస్ట్ ఇదే

  • 150కిపైగా లక్ష్యాన్ని అత్యధిక బంతులు మిగిలివుండగానే ఛేదించిన జట్టుగా నిలిచిన సన్‌రైజర్స్
  • టీ20 హిస్టరీలో తొలి 10 ఓవర్లలో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా అవతరణ
  • ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ విధ్వంసంతో బద్దలైన 9 రికార్డులు
ఐపీఎల్ 2024లో భాగంగా హైదరాబాద్ వేదికగా బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ చిరస్మరణీయ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ విధ్వంసాన్ని లక్నో ఆటగాళ్లు ఆశ్చర్యపడుతూ చూడడం తప్ప ఏమీ చేయలేకపోయారు. ఆ రేంజ్‌లో ఊచకోత కోసిన వీరిద్దరూ ఈ మ్యాచ్‌లో పలు రికార్డులను బద్దలు కొట్టారు. 

రికార్డుల జాబితా ఇదే..
1. టీ20 క్రికెట్‌లో 150కిపైగా స్కోరుని ఎక్కువ బంతులు మిగిలివుండగా ఛేదించిన జట్టుగా సన్‌రైజర్స్ నిలిచింది. 166 పరుగుల లక్ష్యాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ 9.4 ఓవర్లలోనే ఛేదించింది. దీంతో ఏకంగా 62 బంతులు మిగిలి ఉన్నాయి. టీ20 క్రికెట్‌లో ఇదే అతిపెద్ద బంతుల మార్జిన్‌గా రికార్డు నమోదయింది. 2018-19 బిగ్‌బాష్ లీగ్‌లో మెల్‌బోర్న్ స్టార్స్‌పై బ్రిస్బేన్ హీట్ జట్టు 60 బంతులు మిగిలి ఉండగానే 157 పరుగులను ఛేదించింది. ఆ రికార్డుని ఇప్పుడు సన్‌రైజర్స్ బద్దలుకొట్టింది.

2. పురుషుల టీ20 క్రికెట్‌లో 10 ఓవర్లు ముగిసే సమయానికి అత్యధిక స్కోరు చేసిన జట్టుగా సన్‌రైజర్స్ నిలిచింది. గతరాత్రి లక్నో సూపర్ జెయింట్స్‌పై సన్‌రైజర్స్ 9.4 ఓవర్లలో ఏకంగా 167 పరుగులు బాదింది. 2018లో నార్తాంప్టన్‌ షైర్‌పై వోర్సెస్టర్‌ షైర్ జట్టు 10 ఓవర్లలో 162 పరుగులు సాధించగా ఆ రికార్డుని సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్రేక్ చేసింది.

3. పురుషుల టీ20 క్రికెట్‌‌లో పవర్ ప్లేలో రెండవ అత్యధిక స్కోరు చేసిన జట్టుగా సన్‌రైజర్స్ నిలిచింది. లక్నోపై తొలి 6 ఓవర్లు ముగిసే సమయానికి జట్టు స్కోరు ఏకంగా 107పరుగులుగా ఉంది. కాగా ఈ జాబితాలో తొలి స్థానంలో కూడా సన్‌రైజర్స్ జట్టే ఉంది. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లోనే ఢిల్లీ క్యాపిటల్స్‌పై తొలి 6 ఓవర్లలోనే ఏకంగా 125 పరుగులు బాది విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే.

4. ఐపీఎల్ 2024లో ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్ జట్టు ఆటగాళ్లు ఏకంగా 146 సిక్సర్లు బాదారు. ఏ టీ20 టోర్నమెంట్‌లోనైనా ఒక జట్టు కొట్టిన అత్యధిక సిక్సర్ల సంఖ్య ఇదే. గతంలో ఐపీఎల్ 2018లో చెన్నై సూపర్ కింగ్స్ 145 సిక్సర్లు బాదింది. ఆ రికార్డు ఇప్పుడు బ్రేక్ అయ్యింది.

5. ఒక మ్యాచ్‌లో పవర్‌ప్లే రెండు జట్ల మధ్య అత్యధిక వ్యత్యాసం ఈ మ్యాచ్‌లో నమోదయింది. లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య పవర్ ప్లే స్కోర్ వ్యత్యాసం 80 పరుగులుగా ఉంది. పవర్‌ప్లే హైదరాబాద్‌ స్కోరు 107/0, లక్నో సూపర్ జెయింట్స్ 27/2గా ఉన్నాయి.

6. ఐపీఎల్‌లో 20 లోపు బంతుల్లోనే అత్యధిక హాఫ్ సెంచరీలు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో ట్రావిస్ హెడ్ చేరారు. 20 లోపు బంతుల్లో హెడ్ 3 అర్ధ సెంచరీలు బాదాడు. జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్ మాత్రమే హెడ్ సరసన ఉన్నారు. ట్రావిస్ హెడ్ 16 బంతుల్లో 2 అర్ధ సెంచరీలు సాధించడం గమనార్హం.

7. లక్నో సూపర్ జెయింట్స్‌‌పై సన్‌రైజర్స్ ఓపెనర్లు 17.27 రన్ రేట్‌తో 167 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఐపీఎల్‌లో 150కిపైగా పరుగుల భాగస్వామ్యంలో అత్యధిక రన్‌రేట్ కలిగివున్న పార్టనర్‌షిప్‌గా ఇది నిలిచింది.

8. ఐపీఎల్‌లో 150కిపైగా పరుగుల లక్ష్యాన్ని రెండు సార్లు 10 వికెట్ల తేడాతో గెలిచిన జట్టుగా సన్‌రైజర్స్ హైదరాబాద్ నిలిచింది.

9. లక్నో సూపర్ జెయింట్స్‌పై మ్యాచ్‌లో ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఇద్దరూ ఎదుర్కొన్న 58 బంతుల్లో ఏకంగా 30 బౌండరీలు బాదారు. ఇందులో 16 ఫోర్లు, 14 సిక్సర్లు ఉన్నాయి. పురుషుల టీ20 మ్యాచ్‌లో మొదటి 10 ఓవర్లలో అత్యధిక బౌండరీలు ఉన్నాయి. ట్రావిస్ హెడ్, అభిషేక్ భాగస్వామ్యంలో 12 సింగిల్స్, 2 టూస్ మాత్రమే ఉన్నాయి.


More Telugu News