అప్పటిదాకా కట్టడి చేసి ఆఖర్లో పరుగులిచ్చేసిన కమిన్స్... లక్నో గౌరవప్రద స్కోరు

  • ఐపీఎల్ లో నేడు సన్ రైజర్స్ × లక్నో సూపర్ జెయింట్స్
  • హైదరాబాదులో మ్యాచ్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లక్నో జట్టు
  • 20 ఓవర్లలో 4 వికెట్లకు 165 పరుగులు
లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 19వ ఓవర్ కు స్ఫూర్తిదాయక బౌలింగ్, ఫీల్డింగ్ ప్రదర్శన కనబర్చింది. అయితే ఆఖరి ఓవర్ బౌలింగ్ చేసిన సన్ రైజర్స్ కెప్టెన్ పాట్ కమిన్స్ ధారాళంగా పరుగులు ఇచ్చేశాడు. లక్నో ఇన్నింగ్స్ లో 20వ ఓవర్ విసిరిన కమిన్స్ 19 పరుగులు సమర్పించుకున్నాడు. ఆ ఓవర్లో లక్నో బ్యాటర్లు 4 ఫోర్లు కొట్టారు. మొత్తమ్మీద లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 165 పరుగులు చేసింది. 

ఓ దశలో లక్నో జట్టు 11.2 ఓవర్లలో 66 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే, ఆయుష్ బదోనీ, నికొలాస్ పూరన్ జోడీ అద్భుతంగా ఆడి జట్టును ఆదుకుంది. వీరిద్దరూ ఐదో వికెట్ కు అజేయంగా 52 బంతుల్లోనే 99 పరుగులు జోడించడం విశేషం. 

బదోనీ, పూరన్ ధాటిగా ఆడడంతో సన్ రైజర్స్ ఆఖరి 5 ఓవర్లలో ఏకంగా 63 పరుగులు సమర్పించుకుంది. బదోనీ 30 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో 55 పరుగులు (నాటౌట్) చేయగా, పూరన్ 26 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్ తో 48 పరుగులు (నాటౌట్) సాధించాడు. 

అంతకుముందు, కెప్టెన్ కేఎల్ రాహుల్ 29 పరుగులు, కృనాల్ పాండ్యా 24 పరుగులు చేసి ఫర్వాలేదనిపించారు. ఓపెన్ క్వింటన్ డికాక్ (2) తన పేలవ్ ఫామ్ ను కొనసాగిస్తూ మరోసారి త్వరగా అవుటయ్యాడు. స్టొయినిస్ (3) కూడా క్రీజులో ఎక్కువసేపు నిలవలేకపోయాడు. సన్ రైజర్స్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 2, పాట్ కమిన్స్ 1 వికెట్ తీశారు.


More Telugu News