చంద్రబాబు భార్యగా రాలేదు..మహిళగా ఇక్కడకు వచ్చా: నారా భువనేశ్వరి

  • రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదన్న భువనేశ్వరి
  • గంజాయి, మద్యంతో రాష్ట్రం నాశనమైందని వ్యాఖ్య
  • చిత్తూరుజిల్లా  ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నారా భువనేశ్వరి

వైసీపీ ఐదేళ్ల పాలనలో గంజాయి, మద్యంతో ఆంధ్రప్రదేశ్ పూర్తిగా నాశనమైందని, మహిళలకు భద్రత లేదని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి వ్యాఖ్యానించారు. చంద్రబాబు పరిపాలనలోనే రాష్ట్రంలో మహిళలకు రక్షణ దొరుకుతుందన్నారు.  చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పంలో తెలుగుదేశం తరఫున భువనేశ్వరి బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ప్రజలనుద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న దుర్మార్గ పాలనను గద్దె దించేందుకు మహిళలంతా బయటకొచ్చి పోరాడాలని భువనేశ్వరి పిలుపునిచ్చారు. బయటకొచ్చి పోరాడేందుకు మహిళలు భయపడకూడదని ధైర్యం చెప్పారు.

తన భర్త చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు యాభై రోజులకుపైగా మహిళలంతా బయటకొచ్చి పోరాడిన ఫలితంగానే ఆయన జైలు నుంచి విడుదలయ్యారని భువనేశ్వరి గుర్తు చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో చిత్తూరు జిల్లాలో ఒక వ్యక్తి ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేశాడని, ఆ వ్యక్తిని వెంటనే తన దగ్గరకు తీసుకురావాలని పోలీసు శాఖను ఆదేశించారని భువనేశ్వరి తెలిపారు. అయితే అతడు భయపడి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని భువనేశ్వరి గుర్తు చేశారు. మహిళలు, చిన్నారులకు చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రక్షణ ఉంటుందని ఆమె తెలిపారు. తానిక్కడకు చంద్రబాబు భార్యగా రాలేదని, ఒక మహిళగానే వచ్చానని చెప్పారు.


More Telugu News