అదే నిజమైతే ఎమ్మెల్సీ కవిత జైల్లో ఉంటుందా?: కేటీఆర్

  • బీజేపీని ఎదుర్కొనే శక్తి ప్రాంతీయ పార్టీలకే ఉందన్న కేటీఆర్
  • కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను నమ్మి ప్రజలు బీఆర్ఎస్‌ను ఓడించారని వ్యాఖ్య
  • కాంగ్రెస్ హామీలు నెరవేర్చడం లేదని మండిపాటు
బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అయితే తన సోదరి కవిత జైల్లో ఉంటుందా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కుషాయిగూడలో ఆయన మైనార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ... మనుషుల మనసుల్లో విషం నింపి ప్రధాని మోదీ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీని ఎదుర్కొనే శక్తి ప్రాంతీయ పార్టీలకు... నేతలకే ఉందన్నారు. మైనార్టీల కోసం కేసీఆర్ ఎంతో చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే బీజేపీకి వేసినట్లే అన్నారు.

మైనార్టీల కోసం కేసీఆర్ స్కూల్స్ ప్రారంభించారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓట్లు వేసినప్పుడల్లా ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను నమ్మి ప్రజలు బీఆర్ఎస్‌ను ఓడించారని... కానీ హామీలు అమలు కాలేదన్నారు.

రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ స‌వాల్ విసిరారు. 'రేవంత్ రెడ్డి, నీకు నిజంగా దమ్ముంటే నువ్వు ముందుకురా.. నువ్వు పెట్టిన సర్క్యులర్, క్రిశాంక్ పెట్టిన సర్క్యులర్ నిపుణుల ముందు పెట్టి, ఏది ఒరిజినల్.. ఏది ఫోర్జ‌రీ.. ఏది డూప్లికేట్ అనేది తేలుద్దామ'ని కేటీఆర్ స‌వాల్ చేశారు. ఆ తర్వాత ఎవరు చంచల్ గూడ జైలులో కూర్చోవాలో తేలుద్దామన్నారు. ఇక‌నైనా బుద్ది, సిగ్గు తెచ్చుకొని వెంట‌నే క్రిశాంక్‌ను విడుద‌ల చేయాల‌ని డిమాండ్ చేశారు.

అంతకుముందు, బీఆర్ఎస్ సోష‌ల్ మీడియా క‌న్వీన‌ర్ మ‌న్నె క్రిశాంక్‌తో కేటీఆర్ చంచ‌ల్‌గూడ జైల్లో ములాఖ‌త్ అయ్యారు. క్రిశాంక్‌ను కలిసిన అనంత‌రం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. క్రిశాంక్ పోస్ట్ చేసిన స‌ర్క్యుల‌ర్ త‌ప్పా? అని ప్ర‌శ్నించారు. చేయ‌ని త‌ప్పుకు జైల్లో వేశారని మండిపడ్డారు. రేవంత్ స‌ర్కార్ చేసిన వెధ‌వ ప‌నికి క్ష‌మాప‌ణ చెప్పాల‌ని డిమాండ్ చేశారు. క్రిశాంక్‌పై ఉద్దేశ‌పూర్వ‌కంగా కేసులు పెట్టి.. రేవంత్ రెడ్డి చిల్ల‌ర రాజ‌కీయం చేస్తున్నార‌న్నారు.


More Telugu News