ఈ నెల 14న వార‌ణాసిలో ప్ర‌ధాని మోదీ నామినేష‌న్

  • 13వ తేదీన వార‌ణాసిలో ప్ర‌ధాని భారీ రోడ్ షో 
  • కాశీ విశ్వ‌నాథ్ కారిడార్ వ‌ర‌కు ఐదు కిలోమీట‌ర్ల మేర‌ కొన‌సాగనున్న రోడ్ షో
  • ల‌క్ష‌లాది మంది ఈ రోడ్ షోలో పాల్గొనే అవ‌కాశం ఉంద‌న్న బీజేపీ నేత దీలిప్ ప‌టేల్
  • వార‌ణాసి నుంచి ఇప్ప‌టికే వ‌రుస‌గా రెండుసార్లు ఎంపీగా గెలిచిన మోదీ
ప్ర‌ధాని మోదీ యూపీలోని వార‌ణాసి లోక్‌స‌భ ఎంపీ స్థానానికి ఈ నెల 14న నామినేష‌న్ దాఖ‌లు చేయనున్నారు. నామినేష‌న్ వేయ‌డానికి ఒక‌రోజు ముందు (13వ తేదీన) భారీ రోడ్ షో నిర్వ‌హించ‌నున్నారు. జిల్లా అధికారుల స‌మాచారం ప్రకారం ఈ రోడ్ షో ప్రారంభించ‌డానికి ముందు ప్ర‌ధాని బ‌నార‌స్ హిందూ విశ్వ‌విద్యాల‌యం ప్ర‌ధాన గేటు వ‌ద్ద ఉన్న మ‌ద‌న్ మోహ‌న్ మాల‌వీయ విగ్ర‌హానికి నివాళ్లు అర్పిస్తారు. ఆ త‌ర్వాత రోడ్ షోలో పాల్గొంటారు. 

ఇక ఈ రోడ్ షో కాశీ విశ్వ‌నాథ్ కారిడార్ వ‌ర‌కు ఐదు కిలోమీట‌ర్ల మేర‌ కొన‌సాగుతుంది. ల‌క్ష‌లాది మంది ఈ రోడ్ షోలో పాల్గొనే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. అస్సి, సోనార్‌పూర‌, జంగం బ‌రి, గోడౌలియా, బ‌న్స్‌ప‌థ‌క్ మీదుగా విశ్వ‌నాథ్ కారిడార్‌కు చేరుకుంటుంద‌ని బీజేపీ నేత దిలీప్ ప‌టేల్ వెల్ల‌డించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని మోదీకి ఘ‌న స్వాగ‌తం ప‌లికేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు ఆయన తెలిపారు. ఈ రోడ్ షో చ‌రిత్ర‌లో నిలిచిపోయేలా నిర్వ‌హించే బాధ్య‌త‌ను పార్టీ కార్య‌కర్త‌ల‌కు అప్ప‌గించిన‌ట్లు చెప్పుకొచ్చారు. 

ఈ నేప‌థ్యంలో బుధ‌వారం వార‌ణాసి పార్ల‌మెంట్ ప‌రిధిలోని అన్ని నియోజ‌కవ‌ర్గాల‌లో ప్ర‌త్యేక‌ సమావేశాలు నిర్వ‌హిస్తున్నారు. ఈ మీటింగులు ముగిసిన‌ త‌ర్వాత 21 డివిజ‌న్ల‌లోని పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను ప్ర‌ధాని రోడ్ షోకు భారీ సంఖ్య‌లో జ‌నాల‌ను తీసుకువ‌చ్చేలా దిశానిర్దేశం చేయ‌నున్నారు. ఇక వార‌ణాసి నుంచి మోదీ ఇప్ప‌టికే రెండుసార్లు ఎంపీగా గెలిచారు. వ‌రుస‌గా 2014, 2019 పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో ఆయ‌న విజ‌య‌ఢంకా మోగించిన విష‌యం తెలిసిందే.


More Telugu News