లిఫ్ట్ లో పాపపై కుక్క దాడి. బాధతో విలవిల్లాడిన చిన్నారి. ఇదిగో వీడియో

  • ఫ్లాట్ లోకి వెళ్లేందుకు ఒంటరిగా లిఫ్ట్ ఎక్కిన బాలిక
  • ఒక్కసారిగా డోర్ తెరుచుకోవడంతో దూసుకొచ్చి కరిచిన కుక్క
  • ఢిల్లీ శివార్లలోని నోయిడాలో ఘటన
  • పెట్ ఓనర్ తీరుపై మండిపడ్డ నెటిజన్లు
ఢిల్లీ శివార్లలోని నోయిడాలో ఉన్న ఓ పాష్ అపార్ట్ మెంట్ లో దారుణం జరిగింది. ఓ పాపపై పెంపుడు కుక్క దాడి చేసి గాయపరిచింది. నోయిడాలో రోజురోజుకూ  పెరుగుతున్న కుక్క కాట్ల ఉదంతాలను ఇది తెలియజేస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

మే 3న రాత్రి సుమారు 9 గంటలకు లిఫ్ట్ లోని సీసీ కెమెరాలో ఈ వీడియో రికార్డయింది. అందులో ఓ పాప తన ఫ్లాట్ లోకి వెళ్లేందుకు ఒంటరిగా లిఫ్ట్ ఎక్కడం కనిపించింది. మధ్య అంతస్తులోకి రాగానే లిఫ్ట్ డోర్ తెరుచుకుంది. పాప బయటకు వచ్చేందుకు ప్రయత్నించగా అక్కడే ఉన్న ఓ పెంపుడు కుక్క ఒక్కసారిగా లిఫ్ట్ లోకి దూసుకొచ్చింది. దీంతో ఆ చిన్నారి భయంతో కాస్త లోపలకు జరిగింది. 

అయినా కూడా ఆ కుక్క ఆగకుండా ఆమెపై ఎగిరి దూకి కుడి మోచేయి పైభాగంలో కరిచింది. అక్కడే ఉన్న పెట్ ఓనర్ వెంటనే దాన్ని లాగి పడేశాడు. అనంతరం సారీ అన్నట్లుగా చెయ్యి చూపాడు. అయితే లిఫ్ట్ డోర్ మూసుకున్నట్లే మూసుకొని మళ్లీ తెరుచుకోవడంతో కుక్క మరోసారి లోపలకు వచ్చేందుకు ప్రయత్నించింది. కానీ ఆ చిన్నారి వెంటనే బటన్ నొక్కడంతో తలుపు మూసుకుంది. కుక్క కరవడంతో చెయ్యిని చూసుకుంటూ ఆ చిన్నారి బాధతో విలవిల్లాడింది. తన ఫ్లోర్ రాగానే లిఫ్ట్ లోంచి వెళ్లిపోయింది. ఈ వీడియో అందరినీ కలచివేసింది.

పెట్ ఓనర్ పై నెటిజన్లు మండిపడ్డారు. కుక్కను నిర్లక్ష్యంగా వదిలేశాడంటూ తిట్టిపోశారు. కుక్కలను సరిగ్గా పెంచడం రాకపోతే పెంచకూడదని కామెంట్లు పెట్టారు. పాప ర్యాబీస్   వ్యాక్సిన్ తీసుకొని ఉంటుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.


More Telugu News