ఐపీఎల్ లో అనామకుడిగా వచ్చి అదరగొడుతున్న ఆసీస్ బ్యాట్స్ మన్!

  • ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బ్యాటింగ్ సెన్సేషన్ గా జేక్ ఫ్రేజర్ మెక్ గర్క్
  • 20 లేదా అంతకన్నా తక్కువ బంతులలో 3 హాఫ్ సెంచరీలు బాదిన ఆటగాడిగా రికార్డు
  • ఇప్పటివరకు ఆడింది రెండు వన్డేలే.. డీసీతోపాటు మరికొన్ని జట్లకు ప్రాతినిధ్యం
4, 4, 4, 6, 4, 6.
రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు అయిన 22 ఏళ్ల జేక్ ఫ్రేజర్ మెక్ గర్క్ తన బ్యాట్ తో సాగించిన విధ్వంసం ఇది. అనామకుడిగా జట్టులో చేరిన ఈ యువ ఆసీస్ ఆటగాడు ప్రత్యర్థి జట్ల బౌలింగ్ ను చీల్చి చెండాడుతున్నాడు. కొత్త రికార్డులను కొల్లగొడుతూ డీసీ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. 

తాజాగా అతను ఐపీఎల్ చరిత్రలోనే అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. 20 లేదా అంతకన్నా తక్కువ బంతుల్లో మూడు హాఫ్ సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. మంగళవారం రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ లో అతను కేవలం 20 బంతుల్లోనే 50 పరుగులు బాది ఈ రికార్డును అందుకున్నాడు. సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్లతో ఆడిన మ్యాచ్ లలో అయితే 15 బంతుల్లోనే అర్ధ శతకాలు బాదాడు.

పవర్ ప్లే ఆరు ఓవర్లలోనే హాఫ్ సెంచరీలు బాదిన రికార్డు కూడా అతని పేరిటే ఉంది. ఎస్ ఆర్ హెచ్, ఎంఐ జట్లపైనే అతను ఫీట్ సాధించాడు. ఈ సీజన్ లో మెక్ గర్క్ ఇప్పటివరకు 44.14 సగటుతో, 235.87 స్ట్రైక్ రేట్ తో 309 పరుగులు సాధించాడు. మెక్ గర్క్ కేవలం పవర్ ప్లే ఓవర్లలోనే 96 బంతులు ఎదుర్కొని ఏకంగా 245 పరులు చేశాడు. ఇందులో 29 ఫోర్లు, 19 సిక్సర్లు ఉండటం అతని బ్యాటింగ్ విధ్వంసాన్ని చెప్పకనే చెబుతుంది.

జేక్ ఫ్రేజర్ మెక్ గర్క్ ఇప్పటివరకు ఎన్ని వన్డేలు ఆడేడో తెలుసా? కేవలం రెండంటే రెండే! అది కూడా ఈ ఏడాది ఫిబ్రవరిలో వెస్టిండీస్ తో స్వదేశంలో జరిగిన సిరీస్ లో అతను ఆస్ట్రేలియా తరఫున అరంగేట్రం చేశాడు. కానీ టీ20లు మాత్రం ఇప్పటివరకు 44 ఆడాడు. అతను ఢిల్లీ క్యాపిటల్స్ తోపాటు మెల్ బోర్న్ రెనిగేడ్స్, దుబాయ్ క్యాపిటల్స్, విక్టోరియా, సౌత్ ఆస్ట్రేలియా జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

మెక్ గర్క్ కు ముందు ఏడుగురు ఆటగాళ్లు 20 లేదా అంతకన్నా తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీలు చేశారు. యశస్వి జైశ్వాల్ (రాజస్తాన్ రాయల్స్), నికొలస్ పూరన్, కేఎల్ రాహుల్ (లక్నో సూపర్ జెయింట్స్), ఇషాన్ కిషన్, కీరన్ పొలార్డ్ (ముంబై ఇండియన్స్), సునీల్ నరేన్ (కోల్ కతా నైట్ రైడర్స్), ట్రావిస్ హెడ్ (సన్ రైజర్స్ హైదరాబాద్) ఈ ఘనత సాధించారు.


More Telugu News