అసమర్థులు, చేతకానివారు ఉంటే ఇలాగే జరుగుతుంది: రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై కేసీఆర్

  • సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్లుగా 2 లక్షల రూపాయల రుణమాఫీ కాలేదన్న కేసీఆర్
  • దేవుడి మీద ఒట్లు కేసీఆర్ మీద తిట్లు అన్నట్లుగా ముఖ్యమంత్రి తీరు ఉందని విమర్శ
  • మోదీ 150 హామీలు ఇచ్చారు... ఒక్కటీ నెరవేరలేదన్న కేసీఆర్
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ హామీని నెరవేర్చలేదని... అసమర్థులు, చేతకానివారు, తెలివితక్కువవారు రాజ్యంలో ఉంటే ఇదే జరుగుతుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విమర్శించారు. కామారెడ్డిలో బస్సుయాత్రలో పాల్గొన్న కేసీఆర్ మాట్లాడుతూ... సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్లుగా రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఇప్పటి వరకు అమలు కాలేదన్నారు. అయితే దేవుడి మీద ఒట్లు కేసీఆర్ మీద తిట్లు అన్నట్లుగా ముఖ్యమంత్రి తీరు ఉందని మండిపడ్డారు.

మహిళలకు రూ.2500 గ్యారెంటీని అమలు చేస్తున్నారా? అని నిలదీశారు. ఆరు గ్యారెంటీల్లో ఒక్కటీ పూర్తిగా అమలు చేయడం లేదన్నారు. కనీసం పాత రైతుబంధు కూడా ఇవ్వడం లేదన్నారు. కాంగ్రెస్ నేతలు కూడా అరచేతిలో వైకుంఠం చూపించారని మండిపడ్డారు. అమలు కానీ హామీలు ఇచ్చి రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేశారన్నారు.

నిరుద్యోగులకు ఇస్తానన్న నిరుద్యోగ భృతి ఎక్కడకు పోయిందని నిలదీశారు. స్కూళ్లు, కాలేజీల్లో విద్యార్థులకు కనీసం సరైన భోజనం పెట్టడం లేదన్నారు. ఐదు నెలల్లోనే ఆగమాగం చేశారని మండిపడ్డారు. కేసీఆర్ పోగానే స్విచ్ బంద్ చేసినట్లు కరెంట్ పోతోంది... నీళ్లు రావడం లేదన్నారు. కామారెడ్డి జిల్లాగానే ఉండాలంటే బీఆర్ఎస్‌ను గెలిపించాలన్నారు.

ప్రధాని మోదీ 150 హామీలు ఇచ్చారని... కానీ ఒక్కటీ నెరవేరలేదన్నారు. రూపాయి విలువను మోదీ పతనం చేశారన్నారు. తెలంగాణకు నవోదయ పాఠశాలలు ఇవ్వలేదన్నారు. తెలంగాణకు ఒక్క మంచి పని కూడా మోదీ చేయలేదన్నారు. పైగా తల్లిని చంపి బిడ్డను బతికించారని తెలంగాణ ఏర్పాటును అవమానించారని విమర్శించారు. బీజేపీ పెట్టుబడిదారుల పార్టీ అని ఆరోపించారు. ఆ పార్టీ పేదలకు లాభం చేయదన్నారు. బీజేపీకి ఓటు వేస్తే వృథా అవుతుందన్నారు.


More Telugu News