మీ ఒక్క ఓటు భారత్ ను మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారు చేస్తుంది: ప్రధాని మోదీ
- అహ్మదాబాద్ లో ఓటు హక్కును వినియోగించుకున్న ప్రధాని మోదీ
- అనంతరం మధ్యప్రదేశ్ లో మోదీ సుడిగాలి పర్యటన
- ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చిన మోదీ
- మీ ఒక్క ఓటుతో దేశం శక్తిమంతంగా తయారవుతుందన్న ప్రధాని
మీరు వేసే ఒక్క ఓటు భారత్ ను మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారు చేస్తుందని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు. మంగళవారం అహ్మదాబాద్ లో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం నిమిత్తం మధ్యప్రదేశ్ కు వెళ్లారు. అక్కడ ఖర్గోన్ లో నిర్వహించిన బహిరంగ సభలో మోదీ ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ...భారత దేశ భవిష్యత్తును రూపొందించాలంటే ఎక్కువ సంఖ్యలో బీజేపీకి సీట్లు అందించాలని విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో లోక్ సభ మూడో దశ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోందని, మధ్యప్రదేశ్ లో కూడా తొమ్మిది పార్లమెంటరీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని మోదీ పిలుపునిచ్చారు.
మీరు వేసే ఒక్క ఓటు మూడవ అతిపెద్ద ఆర్థికవ్యవస్థ కలిగిన దేశంగా తయారు చేయడమేకాక, ప్రజల సంపాదన, యువతకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయని ఫలితంగా మరింత శక్తిమంతమైన దేశంగా తయారవుతుందని మోదీ చెప్పారు. గతంలో మీరు వేసిన ఒక్క ఓటు ప్రపంచంలోనే భారత్ ఎంతో ప్రభావవంతమైన దేశంగా రూపొందిందన్నారు. డభ్బై ఏళ్ల తర్వాత ఆర్టికల్ 370 రద్దు చేశామని, అయోధ్యలో రామ మందిర నిర్మాణం సాధ్యమైందని మోదీ వివరించారు.
మహిళలకు రిజర్వేషన్ హక్కులు కల్పించామని, ఎట్టకేలకు గిరిజన మహిళకు దేశాధ్యక్షపదవిని కట్టబెట్టగలిగామని, ఎంతోమంది అవినీతి పరుల్ని జైళ్లకు పంపించగలిగామని మోదీ తెలిపారు. మీరు వేసిన ఒక్క ఓటే ఎంతోమంది యువత భవిష్యత్తు భద్రంగా ఉంచిందని, వారికి ఎన్నో ఉన్నతమైన ఉద్యోగ అవకాశాలను కల్పించగలిగిందన్నారు. అన్నికంటే ముఖ్యంగా 25 కోట్ల మంది ప్రజల్ని పేదరికం నుంచి బయటపడవేయగలిగామని మోదీ పేర్కొన్నారు. ఇవన్నీ కూడా 2014, 2019 ఎన్నికల్లో మీరు నాకు వేసిన ఓటు వల్లే సాధ్యమైందని తెలిపారు. ఖర్గోన్ సభ అనంతరం ధార్ లో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు.