మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీ మే 15 వరకు పొడిగింపు

  • ఈ నెల 15 వరకు పొడిగించిన ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు
  • వారానికి ఒకసారి సిసోడియాను పరామర్శించేందుకు భార్యకు అనుమతి
  • అభ్యంతరం చెప్పని దర్యాప్తు సంస్థ ఈడీ
  • కేసు విచారణను ఈ నెల 8 కి వాయిదా వేసి కోర్టు 
  • తదుపరి విచారణకల్లా చార్జిషీట్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశం
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఈ నెల 15 వరకు పొడిగించింది. ఈ కేసు తదుపరి విచారణకల్లా చార్జిషీట్ దాఖలు చేయాలని రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా ఆదేశించారు. 

మనీష్ సిసోడియా బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్ ను ట్రయల్ కోర్టు తిరస్కరించిన తర్వాత ఢిల్లీ హైకోర్టులో మళ్లీ బెయిల్ కోసం మనీష్ సిసోడియా వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. అనంతరం సిసోడియా పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు నోటీసులను జారీ చేసింది. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సిసోడియాను వారానికి ఒకసారి పరామర్శించేందుకు ఆయన భార్యను అనుమతిస్తూ జస్టిస్ స్వర్ణకాంత శర్మ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. సిసోడియాను పరామర్శించేందుకు ఈడీ కూడా అభ్యంతరాలను వ్యక్తం చేయలేదు. ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 8 కి కోర్టు వాయిదా వేసింది. 

గత నెల 30న సిసోడియాకు రెండోసారి కూడా బెయిల్ పిటిషన్ ను జడ్జి బవేజా కొట్టివేసిన సంగతి తెలిసిందే. సీబీఐ తరఫున ప్రాసిక్యూటర్ పంకజ్ గుప్తా కోర్టులో న్యాయమూర్తి బవేజా ఎదుట వాదనలు వినిపించారు. సిసోడియాకు బెయిల్ లభిస్తే ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలను మార్చడం, సాక్షులను ప్రభావితం చేయడం వంటి వాటికి పాల్పడే అవకాశముందని, ఈ కేసులో మనీష్ సిసోడియా చాలా కీలక నిందితుడని కోర్టులో వాదించారు. ఈ దశలో బెయిల్ కు అనుమతిస్తే కేసు విచారణ పక్క దారి పట్టే అవకాశముందని తెలిపారు. దీంతోపాటుగా ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా సిసోడియాకు బెయిల్ ను నిరాకరించాయని తెలిపారు.


More Telugu News