రేవంత్ రెడ్డి హిందువుగా చెప్పుకోవడాన్ని ఖండిస్తున్నాం... క్షమాపణ చెప్పాలి: బీజేపీ నేత లక్ష్మణ్ డిమాండ్

  • ముఖ్యమంత్రి పవిత్రమైన అక్షితలను అవమానిస్తున్నారని ఆగ్రహం
  • హిందువుల మనోభావాలను దెబ్బతీశాడని మండిపాటు
  • రాజ్యాంగానికి విరుద్ధంగా ముస్లిం రిజర్వేషన్లు అంటున్నారని ఆరోపణ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందువుగా చెప్పుకోవడాన్ని తాము ఖండిస్తున్నామని... ఆయన హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ముఖ్యమంత్రి పవిత్రమైన అక్షితలను అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నైతికంగా ఆయనకు హిందువుగా చెప్పుకునే అర్హత లేదన్నారు. హిందువుల మనోభావాలను ఆయన దెబ్బతీశారన్నారు. శ్రీరాముడన్నా... హిందూ దేవుళ్లన్నా కాంగ్రెస్ పార్టీకి ఎందుకు అంత ద్వేషమో చెప్పాలని ప్రశ్నించారు.

రాజ్యాంగానికి విరుద్ధంగా ముస్లిం రిజర్వేషన్లను కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డి సమర్థిస్తున్నారని విమర్శించారు. ముస్లింల ఓట్ల కోసం కాంగ్రెస్ పాకులాడుతోందని విమర్శించారు. ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల పట్ల కాంగ్రెస్ నేతలు అసభ్యపదజాలంతో విరుచుకుపడటం సరికాదన్నారు. తెలంగాణలో మాత్రమే కాదని, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందన్నారు.


More Telugu News