మోదీ గారూ... మా స్వీట్స్ రుచి చూడండి: నారా లోకేశ్

  • రాజమండ్రి వద్ద కూటమి సభ
  • హాజరైన ప్రధాని మోదీ, నారా లోకేశ్, పవన్ కల్యాణ్, పురందేశ్వరి
  • ఇవాళ  యావత్ ప్రపంచం భారత్ వైపు, మోదీ వైపు చూస్తోందన్న లోకేశ్
  • ఆత్రేయపురం పూతరేకులు, తాపేశ్వరం కాజా మోదీ రుచిచూడాలన్న యువనేత
రాజమండ్రి కూటమి సభలో టీడీపీ జాతీయ ప్రధాన  కార్యదర్శి నారా లోకేశ్ పాల్గొన్నారు. విశ్వ జీత్ (విశ్వ విజేత) నరేంద్ర మోదీకి హృదయపూర్వక నమస్కారాలు అంటూ లోకేశ్ ప్రసంగం ప్రారంభించారు. ఆయనను విశ్వ జీత్ అని ఎందుకంటున్నానంటే... ఇవాళ ప్రపంచం అంతా భారత్ వైపు చూస్తోందంటే అందుకు కారణం మోదీనే అని పేర్కొన్నారు. రాజమహేంద్రవరం పేరులోనే రాజసం ఉందని, ఉభయ గోదావరి జిల్లాల ప్రజల మనసు చాలా పెద్దదని, మీ మమకారం, మీ వెటకారం రెండూ సూపర్ అని కొనియాడారు. నరేంద్ర మోదీ గారికి మన ఆత్రేయపురం పూతరేకులు, తాపేశ్వరం కాజా రుచి చూపించాలని అన్నారు. 

"దేశానికి నరేంద్ర మోదీ గారి అవసరం ఎంతో ఉంది. నాలుగు అక్షరాలు దేశం దశ  దిశ మార్చాయి. అది నమో నమో నమో (NaMo). తెలుగు జాతి పౌరుషాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు అయితే, ఇవాళ భారతదేశ పౌరుషాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి నరేంద్ర మోదీ. మోదీ భారతదేశానికి గర్వకారణం... మోదీ నవభారత నిర్మాత. 

మోదీ ఒక సామాన్య కుటుంబం నుంచి ఎదిగిన వ్యక్తి. అందుకే ఆయన ప్రజల సమస్యలు అర్థం చేసుకోగలుగుతున్నారు. మన దేశానికి ఏం కావాలో మోదీకి తెలుసు... పేదరికం లేని దేశం మోదీ కల. 

ఒక వ్యక్తికి చేపలు ఇస్తే అది ఒక రోజు కడుపు నింపుతుంది... కానీ ఆ వ్యక్తికి చేపలు పట్టడం ఎలాగో నేర్పిస్తే అతడికి జీవితాంతం కడుపు నింపుతుంది అనే ఒక సామెత ఉంది. మోదీ తొలి రోజు నుంచే దేశ ప్రజలు తమ కాళ్లపై తాము నిలబడేందుకు అవసరమైన కార్యక్రమాలను తీసుకువచ్చారు. సంక్షేమం, అభివృద్ధిని రెండింటినీ సమతుల్యం చేసి భారతదేశాన్ని ఒక బలమైన శక్తిగా తీర్చిదిద్దారు. 

ఉజ్వల్ యోజన, జల్ జీవన్ మిషన్, ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన, కిసాన్ సమ్మాన్ నిధి, ఆయుష్మాన్ భారత్ వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. దేశాన్ని బలమైన ఆర్థిక శక్తిగా మలిచేందుకు మేకిన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా, భారత్ మాలా వంటి అనేక కార్యక్రమాలు తీసుకువచ్చారు. 

వికసిత్ భారత్ మోదీ కల... వికసిత్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు, పవనన్న కల. 2014లో రాష్ట్ర విభజన జరిగింది... ఏది ఎక్కడుందో వెతుక్కునేందుకు ఆర్నెల్లు పట్టింది. కానీ చంద్రబాబుకు ఉన్న అనుభవం, విజన్ తో లోటు బడ్జెట్ ను అధిగమించి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు సాధించుకున్నాం. అమరావతి నిర్మాణ పనులు ప్రారంభించుకున్నాం. ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ అనేది చేసి చూపించాం. 

విశాఖను ఒక ఐటీ హబ్ గా, రాయలసీమను ఎలక్ట్రానిక్, ఆటోమోటివ్ హబ్ గా చేశాం. ఉభయ గోదావరి జిల్లాలను ఆక్వా హబ్ గా మలిచాం. పోలవరం పనులు పరిగెత్తించాం. మోదీ సహకారంతో ఐఐఎం, ఐఐటీ, ఐసర్, ఎయిమ్స్ వంటి జాతీయ సంస్థలను ఏర్పాటు చేసుకోగలిగాం. చంద్రబాబు అనునిత్యం యువత గురించి ఆలోచిస్తారు. యువతకు మెరుగైన అవశాలు ఇస్తే కుటుంబాలు బాగుపడతాయని భావించారు.

కానీ, 2019లో ఒక్క చాన్స్ అనే నినాదానికి ప్రజలు మోసపోయారు. యావత్ ప్రపంచం మోదీ వైపు, భారత్ వైపు చూస్తుంటే... మన ముఖ్యమంత్రి గారు దక్షిణాఫ్రికాను ఆదర్శంగా తీసుకుని, తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కున్నారు. జగన్ పాలనలో మొదటి బాధితులు యువత. రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ తీసుకురాకపోగా, ఉన్న పరిశ్రమలను తరిమేశారు. 

మోదీ విశాఖకు రైల్వే జోన్ ఇస్తే, ఆ జోన్ కు అవసరమైన భూమిని ఈ ప్రభుత్వం కేటాయించలేదు. నా మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న ఎయిమ్స్ ఆసుపత్రికి ఈ ప్రభుత్వం నీరు కూడా ఇవ్వలేదు. ఎన్నికల ముందు మాట తప్పం, మడమ తిప్పం అన్నారు... ఇప్పుడు మోసానికి ప్యాంటు, షర్టు వేస్తే అచ్చం మన ముఖ్యమంత్రిలాగానే ఉంటుంది. ప్రజలను, రాష్ట్రాన్ని కాపాడుకునేందుకే ప్రజాగళం ఏర్పడింది. పొత్తు దిశగా మొదటి అడుగు వేసింది మన పవనన్న. సంక్షేమం-అభివృద్ధి జోడెద్దుల బండి... దీన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళతాం" అని నారా లోకేశ్ వివరించారు.


More Telugu News