పెట్రోల్, డీజిల్ పై పన్ను కడుతున్నాం.. మళ్లీ టోల్ ట్యాక్స్ ఎందుకు కట్టాలి?: కేటీఆర్

  • సిరిసిల్లలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కేంద్రానికి మాజీ మంత్రి ప్రశ్న
  • పెట్రోల్ డీజిల్ పై పన్నుల రూపంలో పదేళ్లలో రూ.30 లక్షల కోట్ల వసూలు
  • అయినా హైవేలపై టోల్ ట్యాక్స్ పేరుతో ప్రజలపై భారం మోపడం ఎంతవరకు కరెక్ట్ అని నిలదీత
పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేసేటపుడు పన్ను కడుతున్నామని, మళ్లీ హైవేలపై టోల్ ట్యాక్స్ ఎందుకు కట్టాలని తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. వీటిపై ప్రశ్నిస్తే బీజేపీ నేతల వద్ద జవాబు ఉండదని అన్నారు. కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ కు ఓటేసి గెలిపించాలంటూ సిరిసిల్ల పట్టణ కేంద్రంలో కేటీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని శాంతినగర్ చౌరస్తా, గాంధీ చౌక్, తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద కార్నర్ మీటింగుల్లో ప్రజలను ఉద్దేశించి కేటీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఒకసారి పెట్రోల్, డీజిల్ పై పన్ను కట్టాక మళ్లీ టోల్ ట్యాక్స్ పేరుతో హైవేలపై దోపిడీ ఏంటని ప్రశ్నించారు.

కేవలం పెట్రోల్, డీజిల్ పై పన్నులు విధించడం ద్వారా కేంద్రం గత పదేళ్లలో రూ.30 లక్షల కోట్ల ఆదాయం సమకూర్చుకుందని కేటీఆర్ చెప్పారు. పదేళ్ల పాలనలో అదానీ, అంబానీలకు రూ.14.5 లక్షల కోట్లు రుణమాఫీ చేశారని ఆరోపించారు. ఇది తప్పని బీజేపీ నేతలు నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని కేటీఆర్ సవాల్‌ విసిరారు. ఈ లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో 10 నుంచి 12 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ను గెలిపిస్తే వచ్చే ఆరు నెలల్లో కేసీఆర్ మళ్లీ రాష్ట్రాన్ని శాసిస్తారని కేటీఆర్ చెప్పారు.



More Telugu News