ఈ విషయం తెలిస్తే సోషల్ మీడియాపై మీ అభిప్రాయాన్ని మార్చుకుంటారు!

  • మూడు నెలల క్రితం హైదరాబాద్‌లో అదృశ్యమైన టీనేజర్ జయేశ్
  • ఇన్‌స్టాలో జయేశ్ ఫొటోతో తల్లిదండ్రుల పోస్ట్
  • కనిపిస్తే చెప్పాలంటూ ఫొటోతో కాంటాక్ట్ నంబర్
  • అమృత్‌సర్‌లో ఓ వ్యక్తి ఇన్‌స్టా రీల్స్ చూస్తుండగా కనిపించిన ప్రకటన
  • తాను కూర్చున్న హోటల్‌లో పనిచేస్తున్న కుర్రాడు జయేశేనని గుర్తింపు
  • విషయాన్ని అతడి తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పిన ఇన్‌స్టా యూజర్
సోషల్ మీడియా వల్ల సమాజానికి మేలు జరగకపోగా బోల్డంత చెడు జరుగుతోందన్న విమర్శలు ఉన్నాయి. అయితే, ఈ విషయం తెలిస్తే మాత్రం అభిప్రాయాన్ని మార్చుకోవడం పక్కా. మూడు నెలల క్రితం హైదరాబాద్‌లో అదృశ్యమైన టీనేజర్‌ను పట్టించింది సోషల్ మీడియానే. ఇంతకీ ఏం జరిగిందంటే.. హైదరాబాద్‌కు చెందిన 17 ఏళ్ల జయేశ్ కనోడియా జనవరి 17 నుంచి కనిపించకుండా పోయాడు. అప్పటి నుంచి అతడి కుటుంబం వెతుకుతూనే ఉంది. బాలుడి మిస్సింగ్‌పై కేసు నమోదు చేసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తూనే ఉన్నారు. అయినా అతడి ఆచూకీ మిస్టరీగా మారిపోయింది.

ఆదివారం పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఓ కేఫ్‌కు వచ్చిన ఓ వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్ చూస్తుండగా జయేశ్ కనిపించడం లేదని, అతడి ఆచూకీ తెలిస్తే చెప్పాలంటూ అతడి ఫొటోతో ఓ పోస్టు కనిపించింది. తొలుత దానిని కూడా స్క్రోల్ చేసిన అతడు ఆ తర్వాత అనుమానం వచ్చి మళ్లీ చూశాడు. అతడిని ఎక్కడో చూసినట్టు ఉందని అనుకున్నాడు. ఈ క్రమంలో ఈ కేఫ్‌లోని బాయ్‌ను పరీక్షించి చూడగా జయేశ్ ముఖ కవళికలు కనిపించాయి. ఆ తర్వాత అతడు జయేశ్ అని నిర్ధారించుకుని ఆ పోస్టులో ఇచ్చిన కాంటాక్ట్ నంబర్‌కు ఫోన్ చేసి విషయం చెప్పాడు.

ఆ తర్వాత అతడికి వీడియో కాల్ చేసిన జయేశ్ తల్లిదండ్రులు అక్కడ పనిచేస్తున్న కుర్రాడిని చూసి తమ కుమారుడేనని నిర్ధారించుకున్నారు. అతడి ఫోన్ కాల్‌తో తమకు బోల్డంత ఊరట లభించిందని జయేశ్ తండ్రి శైలేష్ ఆనందం వ్యక్తం చేశారు. ఆ వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా నిన్న ఉదయమే అమృత్‌సర్ బయలుదేరారు. కాగా, జయేశ్ హైదరాబాద్‌లో అదృశ్యమయ్యాక జనవరి 24న చివరిసారి న్యూఢిల్లీ రైల్వేస్టేషన్‌లో కనిపించాడు. ఆ తర్వాత మాత్రం అతడికి సంబంధించి ఎలాంటి ఆచూకీ లభ్యం కాలేదు.


More Telugu News