బరువు 317 కిలోలు.. 33 ఏళ్లకే మరణం!

  • ఆర్గాన్ ఫెయిల్యూర్ తో యూకే భారీకాయుడి కన్నుమూత
  • అధిక బరువు కారణంగా కొన్నేళ్లుగా మంచానికే పరిమితమైన జేసన్ హోల్టన్
  • రోజుకు 10,000 కేలరీల ఆహారం తినడంతో అనూహ్య రీతిలో బరువు పెరిగిన వైనం
సుమారు 317 కిలోల బరువుతో యునైటెడ్ కింగ్ డమ్ లోని భారీకాయుల్లో ఒకడిగా నిలిచిన జేసన్ హోల్టన్ 33 ఏళ్లకే కన్నుమూశాడు. ఆర్గాన్ ఫెయిల్యూర్, స్థూలకాయం వల్ల అతను మరణించినట్లు వైద్యులు తెలిపారు. అతన్ని కాపాడేందుకు డాక్టర్లు శాయశక్తులా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది.  సర్రేలో నివసిస్తున్న హోల్టన్ ను ఆస్పత్రికి తరలించడం కూడా గగనమైంది. అంబులెన్స్ సిబ్బంది ఫోన్ చేయడంతో వచ్చిన అగ్నిమాపక శాఖ సిబ్బంది అతన్ని క్రేన్ సాయంతో ఇంటి నుంచి రాయల్ సర్రే ఆస్పత్రికి తరలించారు.

తన కుమారుడి మరణవార్తను హోల్టన్ తల్లి లీసా స్థానిక మీడియాతో మాట్లాడుతూ ధ్రువీకరించింది. హోల్టన్ రెండు కిడ్నీలు ముందుగా పాడయ్యాయని చెప్పింది. దీంతో వారం రోజులు మించి బిడ్డ బతకడని డాక్టర్లు చెప్పారని విలపిస్తూ చెప్పింది. అప్పటి నుంచి తన కొడుకు ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చిందని తెలిపింది. ఇప్పటికి తన కొడుకు ఎనిమిదిసార్లు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడని.. తొమ్మిదోసారి కూడా బయటపడతాడని భావించినా అలా జరగలేదని వాపోయింది.

హోల్టన్ భారీకాయం వల్ల ప్రత్యేక బంగ్లాలో నివసించేవాడు. అందులో తన సైజుకు తగ్గట్లుగా మంచం, ఫర్నిచర్ ఉండేవి. అయితే అధిక బరువు కారణంగా హోల్టన్ కదల్లేకపోయేవాడు. దీనివల్ల మంచానికే పరిమితం కావడంతో శ్వాసకోస సమస్యలు కూడా ఎదుర్కొన్నాడు. రక్తం గడ్డకట్టడం వల్ల 2022లో రెండుసార్లు స్వల్ప పక్షవాతానికి కూడా గురయ్యాడు.

హోల్టన్ టీనేజీలో ఉన్నప్పుడే తండ్రి చనిపోవడంతో ఆ బాధ నుంచి బయటపడేందుకు అతను ఎక్కువ ఆహారం తీసుకోవడం మొదలుపెట్టాడు. ఇది అలవాటుగా మారడంతో అంతకంతకూ బరువు పెరిగిపోయాడు. రోజూ 10,000 కేలరీల ఆహారం తీసుకొనేవాడు. అయితే గతేడాది ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలోని హోల్టన్ తన మరణం గురించి ముందుగానే ఊహించాడు. త్వరలో 34వ ఏడాదికిలోకి అడుగుపెడతానని.. కానీ తన సమయం ముగిసిపోయిందని అనిపిస్తోందంటూ భావోద్వేగానికి గురయ్యాడు. 2020లో మూడో అంతస్తులోని ఫ్లాట్ లో జారిపడటంతో తనను ఆస్పత్రికి తరలించడం కష్టమైందని చెప్పుకొచ్చాడు. తనను కాపాడేందుకు 30 మందికిపైగా అగ్నిమాపక సిబ్బంది, ఓ క్రేన్ అవసరమయ్యాయని వివరించాడు. తన జీవితంలో అత్యంత దుర్భరమైన రోజుగా నాటి ఘటనను గుర్తుచేసుకున్నాడు. ఇంటి చుట్టూ జనం చేరడం చాలా ఇబ్బందిగా అనిపించిందని ఫీలయ్యాడు.


More Telugu News