ఈ విషయాన్ని ధోనీకి ఎవరైనా చెప్పండి: ఇర్ఫాన్ పఠాన్

  • పంజాబ్‌పై మ్యాచ్‌లో ధోనీ 9వ స్థానంలో బ్యాటింగ్ చేయడం సరికాదన్న ఇర్ఫాన్ పఠాన్
  • కనీసం నాలుగైదు ఓవర్లు ఆడడానికి ప్రయత్నించాలని సూచన
  • చెన్నై ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే ఇకపై అన్ని మ్యాచ్‌లూ ముఖ్యమైనవేనని విశ్లేషణ
ఐపీఎల్ 2024లో భాగంగా ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో దిగ్గజ క్రికెటర్ ఎంఎస్ ధోనీ 9వ స్థానంలో బ్యాటింగ్ చేయడంపై మాజీ స్టార్ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ విమర్శలు గుప్పించాడు. ‘‘ ఎంఎస్ ధోనీ 9వ స్థానంలో బ్యాటింగ్ చేయడం చెన్నైకి ఉపయోగపడదు. అది జట్టు గెలుపునకు దోహదపడదు. ధోనీ వయసు 42 ఏళ్లు అని నాకు తెలుసు. కానీ అతడు అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ధోనీ బ్యాటింగ్ బాధ్యతను కూడా తీసుకోవాలి. అతడు కనీసం 4 నుంచి 5 ఓవర్ల వరకు బ్యాటింగ్ చేయగలగాలి. చివరి ఓవర్ లేదా చివరి 2 ఓవర్లలో మాత్రమే బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇది చెన్నై టీమ్‌కి ఎక్కువ కాలం పనిచేయదు’’ అని ఇర్ఫాన్ అన్నాడు. ‘ఇండియా టుడే’తో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. 

చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే ఇకపై అన్ని మ్యాచ్‌లూ ముఖ్యమైనవేనని, 90 శాతం మ్యాచ్‌లు గెలవాలని ఇర్ఫాన్ పఠాన్ విశ్లేషించాడు. ఈ సమయంలో సీనియర్ ఆటగాడైన ధోనీ తన బ్యాటింగ్ ఆర్డర్‌ను ముందుకు ప్రమోట్ చేసుకోవాలని సూచించాడు. ఇటీవలే ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ ప్రభావం చూపించాడని, అయితే పంజాబ్‌పై మ్యాచ్‌లో 9వ స్థానంలో బ్యాటింగ్ చేయడంతో ఉపయోగం లేకుండా పోయిందని ఇర్ఫాన్ విమర్శించాడు. శార్దూల్ ఠాకూర్‌, సమీర్ రిజ్వీ కూడా ధోనీ కంటే ముందు బ్యాటింగ్‌కు వచ్చారని ప్రస్తావించాడు. 15వ ఓవర్‌లోనే ధోనీని క్రీజులోకి పంపించాల్సిందని, కనీసం 4 ఓవర్లు బ్యాటింగ్ చేయాలంటూ ధోనీకి ఎవరైనా చెప్పాలని ఇర్ఫాన్ పఠాన్ విశ్లేషించాడు.

కాగా సీఎస్‌కే, పంజాబ్ మధ్య ధర్మశాలలో జరిగిన మ్యాచ్‌లో ధోనీ 9వ స్థానంలో బ్యాటింగ్ చేశాడు. ధోని తన టీ20 కెరీర్‌లో 9వ స్థానంలో బ్యాటింగ్ చేయడం ఇదే తొలిసారి. అయితే తాను ఎదుర్కొన్న తొలి బంతికే ధోనీ పెవిలియన్ చేరాడు. పంజాబ్ పేసర్ హర్షల్ పటేల్ బౌలింగ్‌లో గోల్డెన్ డక్‌గా వెనుతిరిగాడు. కాగా ప్రస్తుత ఐపీఎల్‌లో ధోనీ చక్కటి ఫామ్‌‌లో ఉన్నాడు. 7 మ్యాచుల్లో 55 సగటు, 224.49 స్ట్రైక్ రేట్‌తో మొత్తం  110 పరుగులు బాదాడు.


More Telugu News