పాకిస్థాన్ గాజులు తొడుక్కుని లేదు.. అణుబాంబులతో ఉంది: రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యలకు ఫరూఖ్ అబ్దుల్లా కౌంటర్

  • పీవోకేను భారత్‌లో విలీనం చేస్తామన్న రాజ్‌నాథ్ వ్యాఖ్యలకు దీటుగా స్పందించిన ఫరూఖ్ 
  • పాక్ ప్రతీకార దాడిలో భారత్‌పై బాంబులు పడతాయని వ్యాఖ్య
  • అలాగే ముందుకు వెళ్లాలనుకుంటే ఆపేదెవరని జేకేఎన్‌సీ చీఫ్
పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేస్తామంటూ రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై జమ్మూకశ్మీర్‌ నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూఖ్ అబ్దుల్లా స్పందించారు. పాకిస్థాన్ గాజులు తొడుక్కుని లేదని, ఆ దేశం వద్ద అణు బాంబులు ఉన్నాయని, పాక్ ప్రతీకార దాడిలో సరిహద్దు అవతల నుంచి మన మీద బాంబులు పడతాయని అబ్దుల్లా కౌంటర్ ఇచ్చారు. దురదృష్టవశాత్తూ మన మీద అణుబాంబులు పడితే ఏంటి పరిస్థితి? అన్నారాయన. 

భారత్‌లో భాగం కావాలని పీవోకే ప్రజలు కోరుకుంటున్నారంటూ రాజ్‌నాథ్ వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజు ఫరూఖ్ అబ్దుల్లా ఈ కౌంటర్ ఇచ్చారు. రక్షణమంత్రి చెప్తున్నట్టు అలాగే చేయాలనుకుంటే ముందుకు వెళ్లాలని, ఆపేందుకు తామెవరిమని ప్రశ్నించారు.

కశ్మీర్‌లో జరుగుతున్న అభివృద్ధిని చూసి భారత్‌లో భాగం కావాలని పీవోకే ప్రజలు కోరుకుంటున్నారని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ప్రజలు తమంతట తాము భారత్‌లో భాగం కావాలనుకుంటున్నారని, పీఓకేను బలవంతంగా భారత్‌లో కలపాల్సిన అవసరం లేదని అన్నారు.


More Telugu News