నరైన్ దూకుడు.. ఎల్‌ఎస్‌జీపై కేకేఆర్ ఘన విజయం!

  • 98 పరుగుల తేడాతో ఎల్ఎస్‌జీ ఓటమి
  • 81 పరుగులతో కేకేఆర్ గెలుపునకు బాటలు వేసిన నరైన్
  • 16 పాయింట్లతో టాప్‌లో నిలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ 
నిన్న లక్నో సూపర్ జైంట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ అద్భుత విజయం సాధించింది. నరైన్ విధ్వంసక ఇన్నింగ్స్‌తో కేకేఆర్ జట్టు ఏకంగా 98 పరుగుల తేడాతో ఎల్‌ఎస్‌జీపై సునాయస విజయం సాధించింది. నరైన్‌కు బౌలర్లు వరుణ్, రసెల్ కూడా అండగా నిలవడంతో ఎల్‌ఎస్‌జీని మట్టికరిచింది. పాయింట్ల పట్టికలో 16 పాయింట్లతో టాప్‌లో నిలిచి ప్లేఆఫ్స్‌లో చోటును దాదాపు ఖరారు చేసుకుంది. 

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్ ఎల్‌ఎస్‌జీకి భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. నరైన్ 39 బంతుల్లో 81 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరు అందించాడు.  సాల్ట్ కూడా జట్టుకు శుభారంభాన్ని ఇచ్చాడు. సాల్ట్ తరువాత రఘువంశీ అండగా నిలవడంతో నరైన్ బ్యాట్ నుంచి పరుగుల వరద కొనసాగింది. చివరకు బిష్ణోయ్ బౌలింగ్‌‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి అవుటయ్యాడు.  ఆ తరువాత వచ్చిన రసెల్, రింకు స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. తరువాత కూడా స్థిరమైన భాగస్వామ్యాలు ఏవి కనిపించలేదు. చివర్లో రమణ్‌దీప్ సింగ్ మెరుపులతో కేకేఆర్ స్కోరు 235 పరుగులకు చేరింది. 

ఛేదనలో ఎల్ఎస్‌జీ తడబడింది. తొలి వికెట్ త్వరగా కోల్పోయినా స్టాయినిస్, రాహుల్ జోడీ గెలుపుపై ఆశలు రేకెత్తించింది. కానీ హర్షిత్ బౌలింగ్‌లో రాహుల్ పెవిలియన్ బాటపట్టడంతో ఎల్‌ఎస్‌జీ పరిస్థితి గాడి తప్పింది. ఆ తరువాత ఏ దశలోనూ ఎల్ఎస్‌జీ బ్యాటర్లు పుంజుకోలేదు. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయిన ఎల్‌ఎస్‌జీ చివరకు పరాజయం పాలైంది. దీపక్ హుడా (5), స్టాయినిస్, పూరన్ (10), బదోని (15), టర్నర్ (16) వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో, 14 ఓవర్ల వద్ద 125/7 స్కోరుకు పరిమితమైంది. టెయిలెండర్లు అద్భుతాలేమీ చేయకపొవడంతో చివరకు ఓటమి చవి చూసింది.


More Telugu News