హీరో సాయిధరమ్‌ తేజ్ ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత

  • గుర్తు తెలియని వ్యక్తి రాయి విసరడంతో ఒక జనసైనికుడికి గాయం
  • నిందితులను అరెస్ట్ చేయాలంటూ జనసేన శ్రేణుల నిరసన
  • గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో జరిగిన ఘటన
పిఠాపురంలో తన మేనమామ, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ గెలుపు కోసం సినీ హీరో సాయి ధరమ్ తేజ్‌ ఆదివారం నిర్వహించిన ప్రచారంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో ప్రచారం నిర్వహిస్తుండగా గుర్తుతెలియని వ్యక్తి రాయి విసరడంతో జనసేన కార్యకర్త ఒకరికి గాయమైంది. తాటిపర్తి గ్రామానికి చెందిన నల్లల శ్రీధర్‌ అనే జనసేన కార్యకర్త తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో తాటిపర్తిలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైసీపీ వాళ్లే ఈ దాడి చేశారని జనసేన కార్యకర్తలు ఆరోపించారు. నిందితులను అరెస్ట్ చేయాలంటూ ఆందోళన చేపట్టారు.  

దాడికి ముందు సాయి ధరమ్‌తేజ్‌ తాటిపర్తికి వస్తున్నారని తెలిసి జనసైనికులు స్థానిక గజ్జాలమ్మ కూడలికి చేరుకుని పవన్‌ కల్యాణ్‌‌కు మద్దతుగా నినాదాలు చేశారు. అయితే అక్కడికి సమీపంలోనే ఉన్న వైసీపీ మద్దతుదారులు జగన్‌ అనుకూల నినాదాలు చేసినట్టు తెలుస్తోంది. ఈ పరిస్థితుల మధ్య తాటిపర్తి కూడలిలో మాట్లాడిన సాయి ధరమ్ తేజ్ అక్కడి నుంచి చినజగ్గంపేటకు వెళ్లారు. అక్కడ మాట్లాడి తిరిగి వెళ్తున్న సమయంలో తాటిపర్తిలో వైసీపీ శ్రేణులు జగన్ అనుకూల నినాదాలు చేయడంతో పాటు టపాసులు పేల్చినట్టు తెలుస్తోంది. దీంతో జనసేన-వైసీపీ శ్రేణుల మద్య ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. ఈ క్రమంలో రాయి దాడి జరిగినట్టు జనసేన శ్రేణులు చెబుతున్నాయి.

పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుడిని పరామర్శించారు. ఓటమి భయంతోనే వంగా గీత ఈ దాడులకు పాల్పడుతున్నారని అన్నారు. సోమవారం కల్లా నిందితులను అరెస్టు చేయకపోతే కాకినాడ జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని, గొల్లప్రోలు పోలీసు స్టేషన్‌ను ముట్టడిస్తామని అన్నారు.


More Telugu News