సజ్జల తనయుడిపై సీఐడీ విచారణకు ఈసీ ఆదేశాలు... కారణం ఇదే!

  • చంద్రబాబుపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందంటూ ఈసీకి వర్ల రామయ్య ఫిర్యాదు
  • పెన్షన్లు అందకపోవడానికి చంద్రబాబే కారణమని ఐవీఆర్ఎస్ కాల్స్ చేస్తున్నారని వెల్లడి
  • వైసీపీ సోషల్ మీడియా ఇంచార్జ్ సజ్జల భార్గవ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఈసీ ఆ పార్టీ, ఈ పార్టీ అని చూడకుండా నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటోంది. తాజాగా, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడు, వైసీపీ సోషల్ మీడియా రథసారథి సజ్జల భార్గవరెడ్డిపై సీఐడీ విచారణకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. 

సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడుపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని టీడీపీ నేత వర్ల రామయ్య చేసిన ఫిర్యాదు పట్ల ఎన్నికల సంఘం స్పందించింది. ఇంటింటికీ పింఛన్లు అందకపోవడానికి చంద్రబాబు నాయుడే కారణం అని ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా వైసీపీ ప్రచారం చేస్తోందంటూ ఈసీకి వర్ల రామయ్య వివరించారు. 

వైసీపీ సోషల్ మీడియా ఇంచార్జ్ సజ్జల భార్గవ రెడ్డి ఆధ్వర్యంలోనే ఈ ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ఓటర్లను, పింఛన్ లబ్ధిదారులను తప్పుదోవ పట్టించేలా ఫోన్లు చేశారని ఆరోపించారు. విద్వేషాలు రగిల్చేలా కుట్రతో తప్పుడు ప్రచారం చేశారని, భార్గవ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని వర్ల రామయ్య ఈసీకి విజ్ఞప్తి చేశారు. 

వర్ల రామయ్య ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న ఈసీ... వైసీపీ ఐవీఆర్ఎస్ కాల్స్ వ్యవహారంపై విచారణ జరపాలని ఏపీ సీఐడీకి స్పష్టం చేసింది. విచారణ చేసి వెంటనే నివేదిక ఇవ్వాలని సీఐడీ డీజీకి నేడు ఆదేశాలు ఇచ్చింది.


More Telugu News