వాట్సాప్ డేటా భద్రంగా ఉండాలా?.. ఈ ఐదు ఆప్షన్లు వాడాలంటున్న టెక్ నిపుణులు!
- వాట్సాప్ బ్యాకప్ నుంచి లాగిన్ వరకు జాగ్రత్తలు
- లింక్డ్ డివైజెస్ తోనూ అప్రమత్తం అవసరమని సూచన
- కొత్తగా వచ్చిన చాట్ లాక్ ఆప్షన్ వాడాలంటున్న నిపుణులు
చిన్నా పెద్దా తేడా లేదు.. వాట్సాప్ వినియోగించని వారే లేరు. మెసేజీలు పంపుకోవడం.. ఫొటోలు, వీడియోలు షేర్ చేసుకోవడమే కాదు.. ఆడియో, వీడియో కాల్స్ చేసుకోవడానికి కూడా వాట్సాప్ ఎంతో సౌకర్యవంతం. అయితే ఎంతో కీలకంగా మారిన వాట్సాప్ లో సెక్యూరిటీ కూడా అంతే ముఖ్యం. లేకుంటే మన డేటా ఇతరుల బారినపడటమో, హ్యాకింగ్‌కు గురికావడమో సమస్యగా మారుతుంది. ఈ సమస్యను తీర్చేందుకు.. వాట్సాప్ కొన్ని సదుపాయాలను అందజేస్తోంది. మరి ఏయే ఆప్షన్లతో సెక్యూర్ గా ఉండవచ్చని టెక్ నిపుణులు చెప్తున్నారంటే..
- మీ వాట్సాప్ బ్యాకప్ ఆప్షన్ లో కూడా ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్షన్ ఆప్షన్ ను ఎనేబుల్ చేసుకోవాలి. గూగుల్ డ్రైవ్ నుంచి, మెయిల్ నుంచి మీ చాట్స్, ఇతర వివరాలు లీక్ కాకుండా ఉంటాయి.
- మీరు చాట్ చేయని, కాంటాక్ట్స్ లో లేని వారి నుంచి కాల్స్ రాకుండా ఉండేందుకు వాట్సాప్ సెట్టింగ్స్ లో ‘సైలెన్స్ అన్ నోన్ కాలర్స్’ ఫీచర్ ను ఎనేబుల్ చేసుకోవాలి. ఇంటర్నేషనల్ నంబర్లతో వచ్చే స్పామ్ కాల్స్ తలనొప్పి ఉండదు.
- మీ వాట్సాప్ లాగిన్ దుర్వినియోగం కాకుండా.. లాగిన్ కోసం టూ స్టెప్ వెరిఫికేషన్ పెట్టుకోండి. వేరే వారు లాగిన్ కాకుండా ఉంటారు.
- మీ వాట్సాప్ అకౌంట్ ఏయే డివైజ్ లలో లింక్ అయి ఉందో, వాటిలో ఎప్పుడెప్పుడు యాక్టివ్‌గా ఉందో ఎప్పటికప్పుడు పరిశీలించండి. లింక్డ్ డివైజెస్ ఆప్షన్ లో ఈ వివరాలు కనిపిస్తూ ఉంటాయి. ఏదైనా సందేహం వస్తే.. వెంటనే ఆ డివైజ్ లో నుంచి గానీ, మొత్తం అన్ని డివైజ్ ల నుంచి గానీ లాగౌట్ చేసేయాలి.
- వాట్సాప్ యాప్ లో కావాల్సిన చాట్‌ను విడిగా లాక్ చేసుకోండి. ఇందుకోసం చాట్‌ను సెలెక్ట్ చేశాక.. కుడి వైపు పైన ఉన్న మూడు చుక్కల ఆప్షన్ పై ట్యాప్ చేయండి. అందులో ‘లాక్ చాట్’ ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయడం ద్వారా.. వేరేవారికి మీ ఫోన్ ఇచ్చినా.. వారు ఆ చాట్ చూడలేరు.