నేను గుంటూరు కారం లాంటోడ్ని... నాతో పెట్టుకోవద్దు జగన్!: పొన్నూరులో పవన్ కల్యాణ్

  • గుంటూరు జిల్లా పొన్నూరులో వారాహి విజయభేరి సభ
  • జగన్ తనను నాన్ లోకల్ అంటుంటాడని పవన్ వెల్లడి
  • ఎవరు ఎక్కడ పుట్టాలో ఎవరికి ఎరుక? అంటూ ఆగ్రహం 
  • ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు జగన్ అంటూ వార్నింగ్
జనసేనాని పవన్ కల్యాణ్ గుంటూరు జిల్లా పొన్నూరులో నిర్వహించిన వారాహి విజయభేరి సభకు హాజరయ్యారు. తన తండ్రి ప్రభుత్వ ఉద్యోగి కావడం వల్ల రాష్ట్రంలో అనేక ప్రదేశాలతో తనకు అనుబంధం ఉందని పవన్ వెల్లడించారు. పల్నాడు, గోదావరి జిల్లాలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో  తన తండ్రి పనిచేశారని, దాంతో తమకు ఒక ఊరంటూ లేకుండా పోయిందని తెలిపారు. 

తెలిసో తెలియకుండానే అన్ని ఊర్లు పరిచయం ఉన్నాయని, చిన్నప్పుడు చీరాలలో ఉన్నప్పుడు పొన్నూరులోని ఆంజనేయస్వామి గుడికి వచ్చేవాళ్లమని, ఆంజనేయస్వామి తమ ఇంటిదైవం అని పవన్ కల్యాణ్ వెల్లడించారు. 

"జగన్ మాట్లాడితే నన్ను నాన్ లోకల్, నాన్ లోకల్ అంటుంటాడు. మొట్టమొదటిగా నాన్ లోకల్ అనే పదం నాకు నచ్చదు. ఎవరు ఎక్కడ పుట్టాలో ఎవరికి ఎరుక? జగన్ కు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా... నేను పుట్టింది బాపట్లలో. నువ్వు నాతో గొడవపెట్టుకుంటే ఎలా ఉంటుందంటే... గుంటూరు కారం రాస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. గుంటూరు కారం చాలా ఘాటు జగన్... జాగ్రత్త... ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడు. 

నేను ఇవాళ పొన్నూరు వస్తున్నానని తెలిసి రాత్రికి రాత్రే హెలిప్యాడ్ తవ్వేశారు. హెలిప్యాడ్ తవ్వేయడం అంటే వైసీపీ నాయకులకు దానర్థం తెలుసా? అది ఉగ్రవాద చర్య. హెలికాప్టర్ ల్యాండ్ అవుతుందని తెలిసి కూడా కావాలని తవ్వేశారంటే అది ఉగ్రవాద చర్య కిందికే వస్తుంది. మీ మీద ఉగ్రవాద కేసులు పెడతాం జాగ్రత్త. 

కూటమి ప్రభుత్వం రాగానే శక్తిమంతమైన లా అండ్ ఆర్డర్ తీసుకువస్తాం. మీలాగా బలహీన లా అండ్ ఆర్డర్ కాదు... పిచ్చివేషాలు వేశారంటే ఒక్కొక్కడికి మక్కెలు విరగ్గొట్టి కింద కూర్చోబెడతాను" అంటూ పవన్ కల్యాణ్ వార్నింగ్ ఇచ్చారు.


More Telugu News