అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి జగన్ ను, రాహుల్ ను పిలిచాం... ఇద్దరూ రాలేదు: అమిత్ షా

  • ధర్మవరంలో కూటమి సభ
  • హాజరైన కేంద్రమంత్రి అమిత్ షా
  • మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చాక రామమందిరం నిర్మించామని వెల్లడి
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ ధర్మవరంలో కూటమి ఎన్నికల ప్రచార సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, నరేంద్ర మోదీ రెండోసారి ప్రధాని అయ్యాక ఐదు నెలల్లోనే అయోధ్య కేసు గెలిచామని, రామమందిర నిర్మాణానికి భూమి పూజ చేశామని, మందిరం నిర్మించడమే కాకుండా, అయోధ్యలో రామాలయానికి ప్రాణప్రతిష్ఠ కూడా చేశామని వివరించారు. 

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి, ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి రావాలని ఆహ్వానాలు పంపామని, కానీ వారు ఇద్దరూ రాలేదని అమిత్ షా ఆరోపించారు. 

ఏపీలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే అభివృద్ధి జరిగిందని, జగన్ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి నిలిచిపోయిందని అన్నారు. జగన్ రూ.13.50 లక్షల కోట్ల అప్పును ప్రజల నెత్తిపై రుద్దారని అమిత్ షా పేర్కొన్నారు. గత ఎన్నికలప్పుడు మద్య నిషేధం హామీ ఇచ్చిన జగన్... రాష్ట్రంలో మద్యం సిండికేట్ ను ప్రోత్సహించారని ఆరోపించారు. కూటమి అధికారంలోకి వస్తే అమరావతిని రాజధానిగా పునర్ నిర్మిస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. 

ఏపీలో 25కి 25 ఎంపీ స్థానాల్లో కూటమి అభ్యర్థులను గెలిపించండి... అసెంబ్లీలో మూడింట రెండొంతుల సీట్లు ఇచ్చి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలి... డబుల్ ఇంజిన్ సర్కారు ఎలా పరుగులు తీస్తుందో మీరే చూస్తారు అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. 

అమిత్ షా, చంద్రబాబు ప్రత్యేక సమావేశం!

ధర్మవరం సభ సందర్భంగా అమిత్ షా, చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కూటమి ఎన్నికల ప్రచారం, తాజా పరిస్థితులపై ఇరువురు కొద్దిసేపు చర్చించారు. ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న తీరు, రాష్ట్రంలో కొందరు అధికారుల వైఖరి గురించి కూడా అమిత్ షా, చంద్రబాబు మధ్య చర్చకు వచ్చాయి. కాగా, నివేదికల ప్రకారం కూటమిదే అధికారమని, ఊహించనిదానికంటే ఎక్కువ సీట్లు వస్తాయని, జగన్ ప్రభుత్వంపై అత్యధిక శాతం ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని అమిత్ షా చెప్పినట్టు తెలుస్తోంది.


More Telugu News