కేటీఆర్​.. చీర కట్టుకుని ఆర్టీసీ బస్సు ఎక్కు.. మేమేం చేశామో కనిపిస్తుంది: రేవంత్​ రెడ్డి సెటైర్​

  • మేం చేసిన అభివృద్ధి, అమలు చేస్తున్న హామీలు కనిపిస్తాయి
  • తెలంగాణకు బీజేపీ గాడిద గుడ్డు ఇచ్చింది
  • ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామని ప్రకటన
కాంగ్రెస్ సర్కారు ఐదు నెలల్లో ఏమీ అభివృద్ధి చేయలేదంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించడంపై టీపీసీసీ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ‘‘కేటీఆర్.. చీర కట్టుకుని వెళ్లి ఆర్టీసీ బస్సు ఎక్కి తిరుగు.. మేం చేసిన అభివృద్ధి, అమలు చేస్తున్న హామీలు కనిపిస్తాయి..” అని వ్యాఖ్యానించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ లో నిర్వహించిన  ఎన్నికల ప్రచార సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు.

బీజేపీ ఇచ్చింది గాడిద గుడ్డు
తెలంగాణ రాష్ట్రానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏమీ చేయలేదని రేవంత్ విమర్శించారు. విభజన హామీలు, ఇతర అభివృద్ధి పనులు చేయాలని కోరితే.. గాడిద గుడ్డు చేతిలో పెట్టిందని వ్యాఖ్యానించారు. అలాంటి బీజేపీ అభ్యర్థులకు ఓటు వేయవద్దన్నారు. ఆదిలాబాద్ అంటే తనకు ప్రత్యేక అభిమానమని.. దత్తత తీసుకుని అభివృద్ధి చేసే బాధ్యత తనదని చెప్పారు.

ఆగస్టు 15 లోపు రుణమాఫీ
కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే ఐదు అమలు చేశామని రేవంత్ చెప్పారు. మే 9వ తేదీలోపు రైతులందరి ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేస్తామని తెలిపారు. ఆగస్టు 15వ తేదీనాటికి ఒకే విడతలో రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని మరోసారి ప్రకటించారు.


More Telugu News