ఊసరవెల్లి రంగులు మార్చినట్లు రేవంత్ రెడ్డి తారీఖులు మారుస్తున్నారు: కేటీఆర్

  • డిసెంబర్ 9 లోపు రుణమాఫీ అని మొదట చెప్పి ఇప్పుడు దేవుళ్ల మీద ఒట్లు వేస్తున్నాడని ఎద్దేవా
  • 33 జిల్లాలను కొనసాగించకుంటే ఉద్యమిస్తామని కేటీఆర్ హెచ్చరిక
  • రేవంత్ దిక్కుమాలిన రాజకీయాలు బంద్ చేయాలని సూచన
ఊస‌ర‌వెల్లి రంగులు మార్చినట్లు రేవంత్ రెడ్డి తారీఖులు మారుస్తున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం పనితీరు పిచ్చోడి చేతిలో రాయిలా ఉందన్నారు. ఈ నాలుగున్న‌ర నెల‌ల కాలంలో చిల్ల‌ర మాట‌లు.. ఉద్దెర ప‌నులు త‌ప్ప చేసిందేమీ లేదన్నారు. రాజ‌న్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ భ‌వ‌న్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... రుణ‌మాఫీ డిసెంబర్ 9వ తేదీలోపు అన్నారని... ఇప్పుడేమో దేవుళ్ల మీద ఒట్లు వేస్తూ రోజుకో తేదీ అంటున్నాడని విమ‌ర్శించారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి నిన్న సిరిసిల్లకు వచ్చినప్పుడు నాలుగు మంచి మాటలు చెబుతాడని భావించానని... కానీ నాలుగున్నర నెలలుగా మాట్లాడిన చిల్లర మాటలు, ఉద్దెర పనులు తప్ప చేసిందేమీ లేదు... మాట్లాడిందేమీ లేదన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పది జిల్లాలుగా ఉన్న తెలంగాణను 33 జిల్లాలుగా చేశారని, కొన్ని జిల్లాలకు మహానుభావుల పేర్లు పెట్టామని గుర్తు చేశారు. కానీ రేవంత్ రెడ్డి కొన్ని కొత్త జిల్లాలను తీసేస్తామని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార వికేంద్రీకరణ తర్వాత ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందరికీ అందాయన్నారు. కొత్త జిల్లాలను కొనసాగించకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు.

ఈ ప్రాంతంలో 3వేల కోట్ల ఆర్డర్ల చీరలు ఇచ్చి చేనేతల బతుకులను కేసీఆర్ నిలబెట్టారని, కానీ ఇప్పుడు వారు ఆర్డర్లు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే నివాళులర్పించకుండా రేవంత్ రెడ్డి అవమానపరిచారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి తాను చేసిన తప్పులకు లెంపలు వేసుకోవాలన్నారు. పిచ్చివాగుడు కట్టిపెట్టి నేతన్నలకు ఆర్డర్లివ్వాలని డిమాండ్ చేశారు. నేతన్నల ఉసురు త‌గిలే దిక్కుమాలిన రాజకీయాలు బంద్ చేయాలని హితవు పలికారు.


More Telugu News