రాయ్ బరేలీ నుంచి రాహుల్ పోటీ చేస్తుండటంపై వయనాడ్ ప్రజలు ఏమంటున్నారంటే..?

  • రెండు చోట్ల పోటీ చేస్తే తప్పేముందంటున్న కొందరు
  • ఇది సరైన నిర్ణయం కాదంటున్న మరికొందరు
  • రెండు స్థానాల్లో గెలిస్తే వయనాడ్ ను వదుకుంటారంటున్న ఇంకొందరు
లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్, ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలీ నుంచి పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో అమేథీ నుంచి ఓడిపోయిన రాహుల్.. వయనాడ్ నుంచి గెలుపొందారు. ప్రస్తుతం ఆయన వయనాడ్ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పుడు వయనాడ్ తో పాటు రాయ్ బరేలీ నుంచి కూడా రాహుల్ పోటీ చేస్తుండటంపై... వయనాడ్ ప్రజల నుంచి మిక్స్ డ్ రియాక్షన్ వస్తోంది. 

రాయ్ బరేలీ నుంచి కూడా పోటీ చేయడంలో తప్పేముందని కొందరు ప్రశ్నిస్తుండగా... మరికొందరు అది తప్పుడు నిర్ణయమని అంటున్నారు. ఇండియా బ్లాక్ కు రాహుల్ నాయకత్వం వహిస్తున్నారని... ఆయన రెండు చోట్ల పోటీ చేయడంలో తప్పేముందని ఒక వ్యక్తి అన్నారు. మరో వ్యక్తి స్పందిస్తూ... రెండు స్థానాల్లో రాహుల్ గెలిస్తే వయనాడ్ ను వదులుకుంటారని చెప్పారు. ఒకవేళ అదే జరిగితే తమకు మంచిగా అనిపించదని అన్నారు. ఏం జరుగుతుందో వేచి చూడాలని చెప్పారు.  

ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) సీనియర్ నేత పీకే కున్హలి కుట్టి మాట్లాడుతూ... వయనాడ్ తో పాటు మరో స్థానం నుంచి పోటీ చేయాలని తాము కూడా రాహుల్ కు సూచించామని చెప్పారు. రాహుల్ రెండు చోట్ల పోటీ చేస్తే తప్పేముందని ప్రశ్నించారు. గతంలో ప్రధాని మోదీ కూడా రెండు స్థానాల్లో పోటీ చేశారని చెప్పారు. రాహుల్ తీసుకున్న నిర్ణయం ఇండియా కూటమికి చోదకశక్తిగా పని చేస్తుందని అన్నారు.


More Telugu News