చంద్రబాబు మాటలు నమ్మొద్దు... రాబోయే రోజుల్లో ఈ చట్టం గొప్ప సంస్కరణ అవుతుంది: సీఎం జగన్

  • ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను ఎన్నికల అస్త్రంగా ఉపయోగిస్తున్న విపక్షాలు
  • ప్రతి సభలోనూ ఈ చట్టంపై వివరణ ఇస్తున్న సీఎం జగన్
  • ఇవాళ  హిందూపురం సభలోనూ ఈ చట్టం ప్రస్తావన
  • ప్రజలకు వారి భూమిపై పూర్తి హక్కులు కల్పించడమే ఈ చట్టం ఉద్దేశమని సీఎం వెల్లడి
ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంశంలో రాష్ట్ర ప్రభుత్వం, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. టీడీపీ, జనసేన వంటి పార్టీలు ఈ చట్టాన్ని ఎన్నికల ప్రచారంలో ప్రధాన అస్త్రంగా ఉపయోగించుకుంటుండగా, సీఎం జగన్ ప్రతి సభలోనూ ఈ చట్టంపై వివరణ ఇస్తున్నారు. 

ఇవాళ హిందూపురంలో నిర్వహించిన వైసీపీ ఎన్నికల ప్రచార సభలోనూ సీఎం జగన్ ఈ చట్టం గురించి వివరించారు. భూమి మీద సొంతదారుకు సంపూర్ణ హక్కులు కల్పించడమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉద్దేశమని స్పష్టం చేశారు. మున్ముందు రోజుల్లో ఈ చట్టం ఒక గొప్ప సంస్కరణ అవుతుందని అన్నారు. 

భూ వివాదాల వల్ల ఇప్పటివరకు రైతులు, ప్రజలు, అధికారులు కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి నెలకొందని, కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో అలాంటి సమస్య ఉండదని సీఎం జగన్ పేర్కొన్నారు. ఇప్పుడు చేస్తున్న సర్వే పూర్తయితే, భూములపై ఎలాంటి వివాదం ఉండబోదని ప్రభుత్వం హామీ ఇస్తుందని తెలిపారు. ఈ చట్టం ద్వారా ఇచ్చే ల్యాండ్ టైటిల్ కు బీమా కూడా ఉంటుందని వెల్లడించారు. 

ఈ చట్టం ప్రకారం... రైతులు, భూ యజమానుల తరఫున ప్రభుత్వం పూచీకత్తుగా నిలబడుతుందని, ప్రజల పక్షాన నిలుస్తుందని అన్నారు. అయితే, ఇదంతా సాధ్యమవ్వాలంటే మొదట భూ సర్వే పూర్తి కావాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఎప్పుడో బ్రిటీష్ పాలన కాలంలో భూ సర్వే జరిగిందని, ఇప్పుడు మీ బిడ్డ హయాంలో సమగ్ర భూ సర్వే జరుగుతోందని వివరించారు. 

భూములకు సరిహద్దు రాళ్లు వేస్తున్నామని, ఆ వివరాలను అప్ డేట్ చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 17 వేల రెవెన్యూ గ్రామాలు ఉంటే, 6 వేల గ్రామాల్లో సర్వే పూర్తయిందని వెల్లడించారు. రానున్న రోజుల్లో మిగతా గ్రామాల్లోనూ సర్వే నిర్వహించి రైతులకు పదిలంగా హక్కు పత్రాలు అందిస్తామని తెలిపారు. 

ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇవ్వకుండా జిరాక్స్ కాపీలు ఇస్తారంటూ విపక్షాలు చేస్తున్న ప్రచారంపైనా సీఎం జగన్ స్పందించారు. ఇది పూర్తిగా అవాస్తవం అని ఖండించారు. దేశవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ల విధానంలో కార్డ్ ప్రైమ్-2 సాఫ్ట్ వేర్ అమలు జరుగుతోందని, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు పూర్తి చేసి పూర్తిస్థాయి డాక్యుమెంట్లును సొంతదార్లకు అప్పగిస్తున్నామని, చంద్రబాబు తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు.


More Telugu News