మొబైల్ ఫోన్ మింగేసిన ఖైదీ.. 20 రోజుల త‌ర్వాత ఆప‌రేష‌న్ చేసి బ‌య‌ట‌కు తీసిన వైద్యులు!

  • కర్ణాటకలోని శివమొగ్గ సెంట్రల్ జైలులో ఘ‌ట‌న‌
  • మొబైల్ ఫోన్ మింగేసిన పరశురామ్ అనే ఖైదీ
  • నెల రోజులుగా జైలులో తీవ్ర‌మైన‌ కడుపు నొప్పితో బాధపడిన ఖైదీ
  • అనుమానంతో ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌డంతో బ‌య‌ట‌ప‌డిన అస‌లు విష‌యం
కర్ణాటకలోని శివమొగ్గ సెంట్రల్ జైలులో ఉన్న ఓ ఖైదీ మింగేసిన మొబైల్ ఫోన్ ను వైద్యులు 20 రోజుల త‌ర్వాత‌ ఆపరేషన్ చేసి బయటకు తీశారు. ప్రస్తుతం ఖైదీ కోలుకుంటున్నట్లు జైలు అధికారులు తెలిపారు. అయితే, అతడు ఎప్పుడు, ఎందుకు మొబైల్ ఫోన్ ను మింగేశాడ‌నేది ఇంకా తెలియలేదని పేర్కొన్నారు.

జైలు అధికారులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. పరశురామ్ అనే ఖైదీ గత కొన్నాళ్లుగా ఓ హ‌త్య కేసులో శివమొగ్గ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే, గత నెల రోజులుగా జైలులో పరశురామ్ తీవ్ర‌మైన‌ కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. దాంతో అధికారులు పరశురామ్ ను వైద్యం కోసం జైలు వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లారు. పరశురామ్ ను పరిశీలించిన వైద్యుడు శివమొగ్గలోని మెగాన్‌ ఆస్పత్రికి తరలించమని జైలు అధికారులకు సిఫార్సు చేశారు. జైలు వైద్యుడి సూచ‌న‌తో ఖైదీని మెగాన్ ఆస్పత్రికి తరలించారు. 

అక్కడి వైద్యులు పరశురామ్ కు పరీక్షలు నిర్వ‌హించి, పొట్ట‌ను ఎక్స్ రే తీశారు. అయితే, ఎక్స్ రే ఫలితాల్లో పరశురామ్ పొట్ట‌లో ఏం ఉందో వైద్యుల‌కు స్పష్టంగా తెలియలేదు. ఈ విష‌య‌మై అత‌డిని డాక్ట‌ర్లు ప్రశ్నించారు. దాంతో అత‌డు రాయి ఉన్న‌ట్లు చెప్పాడు. అయితే, మెగాన్ ఆస్పత్రిలో ఎండోస్కోపీ సౌకర్యం లేకపోవడం వల్ల పరశురామ్ ను అధికారులు ఏప్రిల్ 1వ తేదీన బెంగళూరులోని సెంట్రల్ జైలు వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు.

అక్క‌డ‌ ఏప్రిల్ 6 వరకు పరశురామ్ కు చికిత్స అందించారు. ఆ తర్వాత విక్టోరియా ఆస్పత్రికి తరలించమని అక్క‌డి వైద్యుడు సిఫార్సు చేశారు. అక్కడికి తరలించగా ఆస్పత్రి వైద్యులు ఏప్రిల్ 25న పరశురామ్ కు ఆప‌రేష‌న్‌ నిర్వహించి కడుపులో ఉన్న మొబైల్ ఫోన్‌ను బ‌య‌ట‌కు తీశారు. దాదాపు గంట‌న్న‌ర‌సేపు వైద్యులు తీవ్రంగా శ్ర‌మించి మొబైల్‌ను బ‌య‌ట‌కు తీయ‌డం జ‌రిగింది. ఇక‌ అతడి కడుపులో ఫోన్ ను చూసిన వైద్యులు మొద‌ట‌ షాక్ అయ్యారు. ప్రస్తుతం పరశురామ్ కోలుకుంటున్నట్లు జైలు అధికారులు చెప్పారు.


More Telugu News